
ఈ సారి దీపావళికి థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ఏకంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె-ర్యాంప్ ఒకటీరెండు రోజుల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటన్నింటిలో కె-ర్యాంప్ సినిమాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఈ పండక్కి హాయిగా నవ్వుకునేలా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
షార్ట్ ఫిలింస్ నుంచి హీరోగా..
దీంతో కిరణ్ అబ్బవరానికి (Kiran Abbavaram) పెద్ద హిట్టే అందినట్లు కనిపిస్తోంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇతడు మాట్లాడుతూ.. సైడ్ క్యారెక్టర్లు చేయనని చెప్తున్నాడు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. రచయిత అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. అనుకోకుండా షార్ట్ ఫిలింస్ చేశాను. నాకంటూ ఏదో గుర్తింపు కావాలనిపించింది. షార్ట్ ఫిలింస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో రాజావారు రాణిగారు సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ హిట్టవడంతో పేరొచ్చింది.
లైఫ్ చేంజ్
జనాల్లోకి వెళ్లాలంటే ఏం చేయాలి? అని ఆలోచించి ఎస్‌ఆర్ కళ్యాణమండపం కథ రాసుకున్నాను. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. కాలేజీలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానినే! ఆయన సినిమాలు ఎంజాయ్ చేశాను. కానీ, సినిమా ఇండస్ట్రీకి వచ్చాక జీవితం మారిపోయింది. హీరోగా నా కెరీర్‌ను నిర్మించుకునే పనిలో ఉన్నాను.
క్యారెక్టర్స్ చేయను
పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నా.. నాకంటూ సొంత గుర్తింపు కోరుకుంటున్నా.. కాబట్టి ఈ సమయంలో క్యారెక్టర్స్ చేయలేను. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేస్తా! ఒకవేళ.. కిరణ్ అబ్బవరం మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అంటే అప్పుడు కచ్చితంగా చేస్తాను. కేవలం పవన్ సినిమాలో కనిపించాలని మాత్రం చేయను అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.