
ఈ దీపావళి సందర్భంగా కిరణ్ అబ్బవరం నటించిన ‘కె- ర్యాంప్’(K- Ramp Review) సినిమా నేడు (అక్టోబర్ 18) విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే, తాజాగా ఈ చిత్ర నిర్మాత రాజేశ్ దండ రివ్యూవర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాకి కొందరు ఇచ్చిన రేటింగ్స్ చూసి చాలా బాధపడినట్లు ఆయన పేర్కొన్నారు. కొందరు రివ్యూవర్లు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆవేదన చెందారు.
మీడియా సమావేశంలో కె- ర్యాంప్ చిత్ర నిర్మాత రాజేశ్ ఇలా అన్నారు. 'ఈ సినిమా కేవలం నవ్వుకునేందుకు మాత్రమే తీశాం. ఇందులో లాజిక్స్ వెతకాలని చూస్తే ఏం చేయలేం. మా సినిమాకు రివ్యూవర్లు ఇచ్చిన రేటింగ్స్ చూసి చాలా బాధపడ్డాను. మీ అభిప్రాయాన్ని నేను తప్పకుండా అంగీకరిస్తాను. కానీ, ఇక్కడ ఒక పొరపాటు జరుగుతుంది. మా లాంటి చిన్న నిర్మాతల మీద వివక్ష చూపుతున్నారు. సోషల్‌మీడియాలో కొన్ని సినిమాలకు ఫస్టాఫ్ రివ్యూ ఇచ్చేసి కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాతే సెకండాఫ్ రివ్యూ ఇస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు..?
మరికొందరు మాత్రం రివ్యూ షేర్ చేసి చాల సమయం తర్వాతే రేటింగ్ ఇస్తున్నారు. నేను చిన్న నిర్మాతననే ఇలా చేస్తున్నారా.. ఈ సమస్య నాకు మాత్రమే కాదు . ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మీరు రివ్యూ ఇచ్చేందుకు బాహుబలి లాంటి సినిమాకు ఎంత శ్రద్ధ పెడుతారో కె- ర్యాంప్ లాంటి చిత్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ, కొందరు వివక్ష చూపుతున్నారు. ఇలాంటి దోరణి ఇకనైనా మారాలి.' అని ఆయన అన్నారు.
నిర్మాత రాజేశ్ వ్యాఖ్యలపై నెటిజన్లు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా బాగుందంటూ ఆయనకు ఆండగా నిలబడుతున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరం నటన సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఆపై హీరోయిన్ యుక్తి తరేజా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నప్పటికీ అంతే రేంజ్‌లో దుమ్మురేపిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.