16 గంటలు వర్షంలో కంగనా.. జ్వరంతోనే వాన పాట!

Thalaivi Movie: Kangana Ranaut Shot In Rain For 16 Hours - Sakshi

‘ఇలా... ఇలా..’ అంటూ పాడుతూ, కంగనా రనౌత్‌ అలవోకగా డ్యాన్స్‌ చేశారు. కానీ, ఆ పాట చిత్రీకరణ వెనక పెద్ద కష్టం ఉంది. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’లోని పాట ఇది. జయలలిత పాత్రను కంగనా చేశారు. ఈ చిత్రంలోని ‘ఇలా.. ఇలా..’ పాటను ఇటీవల విడుదల చేశారు. జయలలిత డ్యాన్స్‌ని తలపించేలా ఈ పాటలో కంగనా కనబడుతున్నారు. మొత్తం మూడు రోజులు ఈ పాట చిత్రీకరణకు పట్టింది. గత ఏడాది అక్టోబర్‌లో చిత్రీకరించారు. ఇది వాన పాట. మూడు రోజుల్లో దాదాపు 16 గంటలు ఈ పాట కోసం కంగనా తడవాల్సి వచ్చింది.

సరిగ్గా పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు జ్వరం అట. అయినప్పటికీ లెక్క చేయకుండా, షూట్‌లో పాల్గొన్నారు. విశ్రాంతి తీసుకుని, కోలుకున్నాక చిత్రీకరించవచ్చని చిత్రబృందం అన్నప్పటికీ కంగనా మాత్రం తన కారణంగా షూటింగ్‌ ఆగకూడదనుకున్నారట. ఆమె కమిట్‌మెంట్‌ని చిత్రబృందం అభినందిస్తోంది. ఈ పాట కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వాటర్‌ ఫాల్‌ సెట్‌ వేశారు. డ్యాన్స్‌ మాస్టర్‌ బృందా గోపాల్‌ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 23న ‘తలైవి’ విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top