సండే సినిమా: వెండితెరపై జై జవాన్‌

Telugu movies with army backdrop in Telugu Film Industery - Sakshi

సైనికులు అంటే యుద్ధం.
దేశభక్తి. ప్రేమ. వియోగం.
గెలుపు. మరణం.
అందుకే ప్రపంచ సినిమాతో పాటు భారతీయ సినిమాలో తెలుగు సినిమాలో కూడా సైనికుడు కథానాయకుడు అవుతాడు.
‘సీతా రామమ్‌’లో హీరో సైనికుడు. ప్రేక్షకులు ఆ పాత్రను మెచ్చుకున్నారు. గతంలోనూ ఇలాగే మెచ్చారు. కాని నిజం చెప్పాలంటే తెలుగు సినిమాకు సైనికుడు అంతగా అచ్చి రాలేదు. ‘సండే సినిమా’లో ఈవారం ‘సైనిక సినిమా’.

తెలుగు సినిమాల్లో సైనికుణ్ణి ఎక్కువగా తీసుకోరు. సైనికుడు అంటే ప్రేక్షకులు ఒక రకంగా ప్రిపేర్‌ అవుతారు... ఏ వీరమరణం పొందుతాడోనని. అదీగాక ఉత్తరాది వారితో పోలిస్తే దక్షిణాది వారికి సైనికులతో మానసిక అటాచ్‌మెంట్‌ తక్కువ. ఉత్తరాది వారే ఎక్కువగా సైన్యంలో భర్తీ కావడం ఇందుకు కారణం. అయినప్పటికీ మనవాళ్లు సైనిక నేపథ్యం ఉన్న పూర్తి సబ్జెక్ట్‌లను లేదా ఫ్లాష్‌బ్యాక్‌ కోసం కథ మలుపు కోసం సైనికుల సినిమాలు తీశారు.

‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ఏ.ఎన్‌.ఆర్‌ ‘సిపాయి చిన్నయ్య’ చేశారు. అది ఒక మోస్తరుగా ఆడింది. అదే అక్కినేని ‘జై జవాన్‌’లో నటిస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. ఎన్‌.టి.ఆర్‌. ‘రాము’లో మిలట్రీ జవాను. హిట్‌ అయ్యింది. కాని అదే ఎన్‌.టి.ఆర్‌ నటించిన ‘బొబ్బిలిపులి’ సైనిక సినిమాల్లోకెల్లా పెద్ద హిట్‌గా ఇప్పటికీ నిలిచి ఉంది. అందులోని ‘జననీ జన్మభూమిశ్చ’ పాట దేశభక్తి గీతంగా మార్మోగుతూ ఉంది.

కృష్ణ ‘ఏది ధర్మం ఏది న్యాయం’లో మిలట్రీ కేరెక్టర్‌ చేస్తే ఆడలేదు. కృష్ణ మరో సినిమా ‘చీకటి వెలుగులు’ కూడా అంతే. శోభన్‌ బాబు ‘బంగారు కలలు’ (ఆరాధన రీమేక్‌)లో ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. చిరంజీవి సైనికుడిగా నటించిన భారీ చిత్రం ‘యుద్ధభూమి’ సినీ సైనిక సెంటిమెంట్‌ ప్రకారం ఫ్లాప్‌ అయ్యింది. దీనికి దర్శకత్వం కె.రాఘవేంద్రరావు. అదే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి ఎయిర్‌ఫోర్స్‌ కస్టమ్స్‌ ఆఫీసర్‌గా ‘చాణక్య శపథం’లో నటించినా ఫలితం అదే వచ్చింది.

బాలకృష్ణ ‘విజయేంద్ర వర్మ’, ‘పరమవీర చక్ర’ తగిన ఫలితాలు రాబట్టలేదు. కాని ‘మంగమ్మ గారి మనవడు’లో చిన్న సైనిక నేపథ్యం ఉంటుంది. ఆ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. రాజశేఖర్‌ నటించిన ‘మగాడు’ పెద్ద హిట్‌ అయితే ‘అంగరక్షకుడు’, ‘ఆగ్రహం’ విఫలం అయ్యాయి. నాగార్జున ‘నిన్నే ప్రేమిస్తా’లో సైనికుడిగా కనిపిస్తాడు. సుమంత్‌ ‘యువకుడు’, ‘స్నేహమంటే ఇదేరా’లో సైనిక పాత్రలు చేశాడు.

ఈ కాలం సినిమాలలో మహేశ్‌ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్‌హిట్‌ కొట్టింది. సరిహద్దులో రాయలసీమలో మహేశ్‌ ప్రతాపం చూపగలిగాడు. కామెడీ ట్రాక్‌ లాభించింది. అడవి శేష్‌ ‘మేజర్‌’ తెలుగులో అమర సైనికుల బయోపిక్‌ను నమోదు చేసింది. అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మిశ్రమ ఫలితాలు సాధించింది. రానా ‘ది ఘాజీ అటాక్‌’ హిట్‌.  నాగ చైతన్య ‘లాల్‌సింగ్‌ చడ్డా’లో తెలుగు సైనికుడిగా కనిపిస్తాడు.

ఈ సైనిక సెంటిమెంట్‌ గండాన్ని దాటి ‘సీతా రామమ్‌’ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇందులో రామ్‌ అనే సైనికుడు నూర్జహాన్‌ అలియాస్‌ సీతామహాలక్ష్మి అనే యువరాణితో ప్రేమలో పడటమే కథ. దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ పాత్రలు తెర మీద మంచి కెమిస్ట్రీని సాధించాయి. పాటలు మనసును తాకాయి. హిమాలయ సానువులు, మంచు మైదానాలు కూడా ఈ కథలో భాగమయ్యి కంటికి నచ్చాయి. గొప్ప ప్రేమకథలు విషాదాంతం అవుతాయి అన్నట్టుగా ఈ కథ కూడా విషాదాంతం అవుతుంది. అందుకే ప్రేక్షకులకు నచ్చింది.

బాంధవ్యాలను, కుటుంబాలను వదిలి దేశం కోసం పహారా కాసే వీరుడు సైనికుడు.
అతని చుట్టూ ఎన్నో కథలు. ఆ కథలు సరిగా చెప్తే ఆదరిస్తామని ప్రేక్షకుడు అంటున్నాడు. మున్ముందు ఎలాంటి కథలు వస్తాయో చూద్దాం.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top