తాప్సీ ఫేవరెట్‌ బుక్ ‘పర్వీన్‌బాబీ: ఏ లైఫ్’

Taapsee Pannu Favourite Book: Parveen Babi A Life - Sakshi

పర్వీన్‌బాబీ: ఏ లైఫ్‌.. మై ఫేవరెట్‌ బుక్‌- తాప్సీ

రచన: కరిష్మ ఉపాధ్యాయ్‌

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన తాప్సీ పన్ను ‘గేమ్‌ ఓవర్‌’ ‘తప్పడ్‌’ ‘బద్లా’... మొదలైన సినిమాలతో బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి పర్వీన్‌బాబీ: ఏ లైఫ్‌ బుక్‌. ఈ పుస్తకం సంక్షిప్త పరిచయం...

చిత్రమేమిటంటే బాబీ గురించి మనకు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ ఏమీ తెలియదు! గాసిప్‌ల నుంచి ఆమె జీవితాన్ని కాచి వడబోయలేం కదా! ఏదో ఒక శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలి కదా.... సరిగ్గా ఈ ప్రయత్నమే పర్వీన్‌బాబీ: ఏ లైఫ్‌ బుక్‌. ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ కరిష్మ ఉపాధ్యాయ్‌ ఈ పుస్తకాన్ని రాశారు. తన రిసెర్చ్‌లో భాగంగా పాత ఇంటర్య్వూలను సేకరించడంతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు డానీ, కబీర్‌బేడి, మహేష్‌భట్‌లాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేశారు. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అనే భయంతో మొదట మాట్లాడడానికి నిరాకరించారు చాలామంది. వారిని ఒప్పించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది.

సినిమా వ్యక్తులనే కాదు అహ్మదాబాద్‌లో బాబీ చదివిన కాలేజికి వెళ్లారు. ఆమెకు పరిచయం ఉన్న వాళ్లతో మాట్లాడారు. కెరీర్‌ మొదలైన రోజుల్లో బాబీ నటించిన ‘చరిత్ర’ కమర్శియల్‌ సినిమా ఏమీ కాదు. ఒక బాధిత యువతి పాత్రలో ఇందులో నటించింది. ‘ఇందులో నటించిన అమ్మాయికి గర్వం తలకెక్కపోతే భవిష్యత్‌లో మంచి నటి అవుతుంది’ అని రాసింది ఒక పత్రిక.

ఆమెకు గర్వం తలకెక్కిందా లేదా అనేది వేరే విషయంగానీ, బాలీవుడ్‌ను ఊపేసిన కథానాయికగా ఎదిగింది. గ్లామర్‌డాల్‌గా మాత్రమే సుపరిచితమైన బాబీలో మరోకోణం...ఆమె గుడ్‌ స్టూడెంట్‌. మంచి చదువరి. రచనలు చేస్తుంది. పెయింటింగ్స్‌ వేస్తుంది. మద్యపానం, మాదకద్రవ్యాలకు బానిస కావడమే ఆమె మానసిక సమస్యలకు కారణమనే వాదాన్ని  కరిష్మ ఖండిస్తారు. పాలు, నీళ్లను వేరు చేసినట్లు అపోహలు, వాస్తవాలను వేరు చేసే క్లోజప్‌ వెర్షన్‌ ఈ పుస్తకం. 
  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top