సుశాంత్‌ వదిలేసుకున్న బ్లాక్‌బస్టర్‌ సినిమాలు!

Sushant Singh Rajput Rejected These Hit Films - Sakshi

‘చిచోరే’లో అనిరుథ్‌లా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ధైర్యం చెప్పేంత బలమైన వ్యక్తి సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌. కానీ మానసిక వేదనను మెదడును, మనసును అనుక్షణం దహించివేస్తుండటంతో గతేడాది జూన్‌ 14న ముంబైలోని నివాసంలో ఆత్మహత్య చేసుకుని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. భౌతికంగా అయినవారిని, అభిమానులను అందరీ అర్ధాంతరంగా వదిలి పోయినా ఇంకా తన సినిమాలతో కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాడు. అయితే సుశాంత్‌ తన కెరీర్‌లో కొన్ని సినిమాలను చేజేతులా వదులుకున్నాడు. అందులో కొన్ని బ్లాక్‌బస్టర్‌ హిట్లు సాధించాయి. మరి సుశాంత్‌ తిరస్కరించిన ఆ 7 సినిమాలేంటో ఓసారి చదివేయండి. (చదవండి: భావోద్వేగం: సుశాంత్‌ రాసుకున్న లేఖ వైరల్‌)

రామ్‌ లీలా: సంజయ్‌ లీలా భన్సాలీ ఈ కథను మొదట సుశాంత్‌కే వినిపించాడు. కానీ అప్పటికే కొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉండటంతో కుదరదని చెప్పాడు. దీంతో ఈ సినిమా హీరో రణ్‌వీర్‌ చెంతకు చేరింది.

కబీర్‌ సింగ్‌: ఓ వైపు వివాదాల్లో నానుతూనే మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం అర్జున్‌ రెడ్డి. దీని హిందీ రీమేక్‌ కబీర్‌ సింగ్‌ను సుశాంత్‌తో లేదా అర్జున్‌ కపూర్‌తో తీయాలనుకున్నారు. కానీ ఇద్దరూ నో చెప్పడంతో ఈ హిట్‌ సినిమా షాహిద్‌ కపూర్‌ చేతిలో పడింది.
 

అంధదున్‌: శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ సినిమా యూనిట్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు సుశాంత్‌ అయితే బాగుంటుంది అని అనుకున్నాడట. కానీ ఏమైందో ఏమో కానీ సడన్‌గా ఈ సినిమా ఆయుష్మాన్‌ ఖురానా దగ్గరకు వెళ్లడం, అతడు ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి.

ఫితూర్‌: ఈ సినిమాను ఎలాగైనా సుశాంత్‌తోనే చేయాలని దర్శకనిర్మాతలు పట్టుపట్టారు. కానీ బిజీ షెడ్యూల్‌ వల్ల ఈ సినిమా చేయడం కుదరదని అతడు చేతులెత్తేశాడు. దీంతో ఆదిత్యరాయ్‌ కపూర్‌ టైటిల్‌ రోల్‌ చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత బాగా లేదని, అతడు ఈ సినిమాను చేయకపోవడమే మంచిదైందని ఆదిత్యరాయ్‌ పేర్కొన్నాడు.

బేఫికర్‌: కథ రాసుకున్న వెంటనే సుశాంత్‌-వాణీకపూర్‌ జోడీ అయితే బాగుంటుందని అనుకున్నాడు దర్శకుడు ఆదిత్య చోప్రా. కానీ పలు కారణాల వల్ల సుశాంత్‌ స్థానంలో హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటించాడు.

హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌: ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సుశాంత్‌, కృతీ సనన్‌ను హీరోహీరోయిన్లుగా అనుకున్నారు. చివరికి మాత్రం అర్జున్‌ కపూర్‌, శ్రద్ధా కపూర్‌ ప్రధానపాత్రల్లో నటించారు.

రా(రోమియో అక్బర్‌ వాల్టర్‌): ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని కూడా సుశాంత్‌ చేజార్చుకున్నాడు. (చదవండి: 200 ఆడిషన్స్‌కు వెళ్లాను: మీర్జాపూర్‌ నటి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top