అప్పుడు పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడ్డా!

Suhasini Maniratnam Emotional Speech At Ponniyin Selvan Pre Release Event - Sakshi

– సుహాసినీ మణిరత్నం

‘‘నలభై రెండేళ్లుగా మీరు (ప్రేక్షకులు) నాపై చూపించిన ప్రేమని ‘పొన్నియిన్‌ సెల్వన్‌’పై చూపించండి. ఈ సినిమా ఓ పది శాతం షూటింగ్‌ చెన్నైలో జరిగితే మిగిలినదంతా రాజమండ్రి, హైదరాబాద్‌లో చేశాం.. కాబట్టి ఇది మీ (తెలుగు) సినిమా.. మీరు ఆదరించాలి’’ అని నటి సుహాసినీ మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (‘పీయస్‌–1’). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం,  కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘పీయస్‌–1’ ఈ నెల 30న విడుదల కానుంది.  ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పెళ్లికి ముందు మణిరత్నంగారు ఓ పెద్ద బ్యాగ్‌ నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అందులో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఐదు భాగాలుగా ఉంది. చదివి ఒక్క లైన్‌లో కథ చెప్పమన్నారు. నేను ఐదు భాగాలను చదివి ఐదు లైన్లుగా రాసి ఇచ్చాను. ఇలాగేనా రాసేది? అన్నారాయన. అప్పుడు మా పెళ్లి ఆగిపోతుందేమో? అని భయపడ్డాను.. కానీ పెళ్లయింది. మా పెళ్లయిన 34 ఏళ్లకి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తీశారాయన. దానికి ముఖ్య కారణమైన సుభాస్కరన్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు.  

ఐశ్వర్యా రాయ్‌ మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్‌ సెల్వన్‌’ టీమ్‌తో ఇక్కడ ఉండటం గర్వంగా ఉంది. ప్రతిభావంతులైన మంచి యూనిట్‌తో పని చేయడం గౌరవంగా ఉంది. నా తొలి సినిమా (‘ఇద్దరు’) మణిరత్నం సార్‌తో చేశాను. ఆయన కలల ప్రాజెక్ట్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లోనూ భాగం కావడం హ్యాపీ’’ అన్నారు.  
నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో ఒక హీరోని పెట్టుకుని సినిమా తీయా లంటే చుక్కలు కనిపిస్తున్నాయి.. అలాంటిది ఇంతమంది హీరోలు, హీరోయిన్లని పెట్టి మణిరత్నంగారు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ని రెండు భాగాలుగా తీయడం గ్రేట్‌. ఇప్పుడు సినిమాకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు.. బాగుంటే ఇండియా మొత్తం ఆదరిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్, కార్తికేయ 2’ చిత్రాల్లా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ కూడా ఇండియా మొత్తం అద్భుతం సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ఇండియాలో రెహమాన్‌గారు ఉన్నారని చెప్పుకునేందుకు భారతీయుడిగా గర్వపడతాం’’ అన్నారు.

ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ– ‘‘38 ఏళ్ల క్రితం నా ప్రయాణం తెలుగులో ప్రారంభమైంది. రమేశ్‌ నాయుడు, చక్రవర్తి, రాజ్‌–కోటి, సత్యంగార్లు సంగీతానికి ఒక పునాది వేశారు. ఇన్నేళ్లుగా నా సంగీతాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాని అందరూ చూసి, ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు.  
‘‘పొన్నియిన్‌ సెల్వన్‌ ’ లాంటి మంచి టీమ్‌తో పని చేయడం హ్యాపీ. చాన్స్‌ ఇచ్చిన మణిరత్నం సార్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు త్రిష.

‘‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో అందరూ హీరోలే, అందరూ హీరోయిన్లే. నా డ్రీమ్‌ డైరెక్టర్‌ మణిరత్నంగారు అంత అద్భుతంగా మా పాత్రలను తీర్చిదిద్దారు’’ అన్నారు విక్రమ్‌.
‘‘మణిరత్నంగారి నలభై ఏళ్ల కల ఈ సినిమా. ఇది ‘బాహుబలి’ సినిమాలా ఉంటుందా? అని అడుగుతున్నారు. ఒక ‘బాహుబలి’ని మనం చూశాం.. ఇంకో ‘బాహుబలి’ అవసరం లేదు. ఇండియాలో ఎన్నో కథలు ఉన్నాయి.. వాటిని మనం ప్రజలకు చెప్పాలి. ఇలాంటి ఒక గొప్ప సినిమాని మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు కార్తీ.
‘‘మా నాన్న ఎడిటర్‌ మోహన్‌గారు ‘హిట్లర్, హనుమాన్‌ జంక్షన్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ వంటి చిత్రాలు నిర్మించారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఒక అద్భుతం’’ అన్నారు ‘జయం’ రవి.
 ఐశ్వర్యా లక్ష్మి, శరత్‌ కుమార్, విక్రమ్‌ ప్రభు, అనంత శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top