స్టీవెన్ స్పీల్‌‌బర్గ్‌ తండ్రి మృతి.. ఎలాంటి అనారోగ్యం లేదు

Steven Spielberg Father Arnold Spielberg Dies at 103 in Los Angeles - Sakshi

లాస్‌ ఏంజెలెస్: సంచలనాలకు మారుపేరుగా నిలిచిన హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. పర్సనల్‌ కంప్యూటర్‌ ఆవిష్కర్త స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తండ్రి ఆర్నాల్డ్‌ స్పిల్‌బర్గ్‌‌(103) మరణించారు. లాస్‌ ఏంజెలెస్‌‌లో కుటుంబ సభ్యుల మధ్య మంగళవారం ఆయన మరణించినట్లు ప్రకటించారు. ఆర్నాల్డ్‌ది సహజ మరణమని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వారు తెలిపారు. ఆర్నాల్డ్‌ స్పీల్‌బర్గ్‌‌, చార్లెస్‌ ప్రాప్స్టర్‌ ఇరువురు 1950 చివర్లో జనరల్‌ ఎలక్ట్రిక్‌ కోసం పని చేస్తున్నప్పుడు జీఈ-225 మెయన్‌ఫ్రేమ్‌ కంప్యూటర్‌ని రూపొందించారు. ఆ తర్వాత దీని సాయంతో డార్ట్మౌత్‌ కాలేజీలోని కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ‘బేసిక్‌’ని అభివృద్ధి చేశారు. ఈ ప్రొగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ 1970-80లలో అభివృద్ధి చేసిన వ్యక్తిగత కంప్యూటర్లకు ఎంతో ఉపయోగపడింది. 

ఓ సారి స్టీవెన్‌ మాట్లాడుతూ.. ‘మా నాన్న కంప్యూటర్‌ ఎలా పని చేస్తుందో వివరించాడు. కానీ ఆ రోజుల్లో నాకు కంప్యూటర్‌ సైన్స్‌ భాష గ్రీకులాగా తోచేది. అస్సలు అర్థమయ్యేది కాదు’ అన్నారు. అంతేకాక ‘ప్రస్తుతం ఉన్న ప్లే స్టేషన్‌, సెల్‌ఫోన్‌, ఐప్యాడ్‌ లాంటి వాటిని చూస్తే.. వీటన్నింటికి వెనక నా తండ్రి లాంటి ఎందరో మేధావుల కృషి ఉంది కదా అనిపిస్తుంది. చాలా గర్వపడతాను’ అన్నారు స్టీవెన్‌. ఈ దర్శకుడు తన 16వ ఏట 1963లో తొలిసారిగా ‘ఫైర్‌లైట్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సమయంలో ఆర్నాల్డ్‌ అతడికి ఎంతో సాయం చేశారు. గ్రహాంతరవాసులు భూమి మీదకు వస్తే.. ఎలా ఉంటుందనే అంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్నాల్డ్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సమకూర్చారు. సినిమాల విషయంలో స్టీవెన్‌ తన సలహాలు కోరతాడని.. కానీ ఐడియాలు అన్ని అతడివే అన్నారు ఆర్నాల్డ్‌. (చదవండి: జురాసిక్‌.. ఫుల్‌ కిక్‌)

ఉక్రేనియన్ యూదు వలసదారుల కుమారుడైన ఆర్నాల్డ్ స్పీల్‌బర్గ్ 1917లో సిన్సినాటిలో జన్మించాడు. మొదటి నుంచి కూడా అతడికి గాడ్జెట్స్‌ అంటే ఎంతో ప్రీతి. ఈ క్రమంలో 9 సంవత్సరాల వయస్సులో సొంత క్రిస్టల్ రేడియోను.. 15 ఏళ్ళ వయసులో ఒక హామ్ రేడియోను తయారు చేశారు. ఈ నైపుణ్యాలు అతడికి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బాగా పనికి వచ్చాయి. 490 వ బాంబ్ స్క్వాడ్రన్ కోసం రేడియో ఆపరేటర్, చీఫ్ కమ్యూనికేషన్ మ్యాన్‌గా పని చేశాడు ఆర్నాల్డ్‌. దీనిని బర్మా బ్రిడ్జ్ బస్టర్స్ అని కూడా పిలుస్తారు. ఆర్నాల్డ్‌ స్పీల్‌బర్గ్‌కు ముగ్గురు భార్యలు.. నలుగురు సంతానం. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్(73) మొదటి సంతానం. అతనికి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు.. వారు స్క్రీన్ రైటర్ అన్నే స్పీల్‌బర్గ్, నిర్మాత నాన్సీ స్పీల్‌బర్గ్‌, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ స్యూ స్పీల్‌బర్గ్. వీరంతా మొదటి భార్య లేహ్‌ స్పీల్‌బర్గ్‌ సంతానం. ఆమె 2017లో మరణించారు. మూడవ భార్య బెర్నిస్‌ కోల్నర్‌ స్పీల్‌బర్గ్‌ 2016లో మరణించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top