
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దసరా సందడి ప్రతి ఏడాది కంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువగా కనిపించింది. ఈ పండగ సందర్భంగా పలు సినిమాలు ఘనంగా ప్రారంభోత్సవాలు జరుపుకున్నాయి. ఆ చిత్రాల వివరాలేంటే చూద్దాం.
వెంకటేశ్ క్లాప్‌తో... నాని హీరోగా ‘సాహో, ఓజీ’ చిత్రాల ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో కొత్త సినిమాకి శ్రీకారం జరిగింది. ‘నాని 34’ అనే వర్కింగ్ టైటిల్‌తో నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్, నిహారిక ఎంటర్‌టైన్మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హీరో వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. నాని తండ్రి రాంబాబు ఘంటా కెమెరా స్విచ్చాన్ చేయగా, నాని, వెంకట్ బోయనపల్లి కలిసి స్క్రిప్ట్‌ను సుజిత్‌కి అందించారు. ఫస్ట్ షాట్‌కి దర్శకులు రాహుల్ సంకృత్యాన్, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేస్తూ, నానీని ఎప్పుడూ చూడని పాత్రలో చూపించనున్నారు సుజిత్’’ అని వెంకట్ బోయనపల్లి తెలిపారు.
కాంబినేషన్ రిపీట్... హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ (2023) మంచి విజయం సాధించింది. ఈ కాంబినేషన్‌లో మరో సినిమా ఆరంభమైంది. ‘శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు 2’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయిదుర్గా తేజ్ క్లాప్ కొట్టగా, హీరో నారా రోహిత్ స్క్రిప్ట్‌ని నిర్మాతలకు అందజేశారు. ‘‘హై ఓల్టేజ్ హ్యూమర్ ఎక్కువగా ఉండే కథనంతో ఈ చిత్రం నాన్‌స్టాప్ వినోదాన్ని అందించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
సరికొత్త ప్రేమ కథ
‘ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాల ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. చైతన్యా రావు హీరోగా, ఐరా, సాఖీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్ణ నాయుడు, శ్రీకాంత్ .వి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ దేవా కట్టా క్లాప్ కొట్టారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్‌లు స్క్రిప్ట్‌ని డైరెక్టర్‌కి అందజేశారు. వర ముళ్లపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సరికొత్త ప్రేమకథతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్, కెమెరా: జ్ఞాన శేఖర్.
ముగ్గురు యువకుల స్నేహం: ప్రేమ్, వాసంతిక జంటగా ‘మావా’ టైటిల్‌తో సినిమా ఆరంభమైంది. ఏ.ఆర్. ప్రభావ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకటేశ్ బాలసాని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి వెంకటేశ్ బాలసాని క్లాప్ ఇవ్వగా, ఆయన సతీమణి పద్మ కెమెరా స్విచ్చాన్ చేశారు. మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య సిరికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘స్నేహం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ముగ్గురు అబ్బాయిల మధ్య ఉండే స్నేహాన్ని అద్భుతంగా చూపించబోతున్నాం’’ అని యూనిట్ తెలిపింది.
థ్రిల్లర్ నేపథ్యంలో... అభిరామ్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ రెడ్డి దాసరి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి భగీరథ కెమెరా స్విచ్చాన్ చేయగా, స్క్రిప్టును ఎన్.ఆర్. అనురాధా దేవికి అందించారు అభిరామ్. లవ్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నారు మేకర్స్.