సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వృత్తి జీవితంలో సర్దుకొని పోవాల్సి వస్తుంది. చాలా సందర్భాలలో తమ అభిప్రాయాలు, లక్ష్యాలు, ప్లాన్లు అన్నీ ఇతరులకు అనుకూలంగా మార్చుకుంటారని, అది త్యాగమని కూడా భావించకుండా..ముందుకు సాగుతున్నారు’ అని స్టార్ హీరోయిన్ సమంత ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో గుర్తింపు పొందేందుకు పురుషులతో పోలిస్తే మహిళలలు మరింత కష్టపడాల్సి వస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ సంస్థ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు.
ఆ అలవాటుని మార్చుకోవాలి
ఈ సందర్భంగా మహిళల స్థితిగతులపై సమంత మాట్లాడుతూ.. ‘సమాజంలో ఇతరులు సౌకర్యంగా ఉండటానికి మహిళలు తమ అభిప్రాయాలు, షెడ్యూళ్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. తమ ఆశయాలను వదులుకుంటూ , ఇతరుల కోసం బతకడం మహిళలకు అలవాటైపోయింది. ఇకనైనా మహిళలు ఈ అలవాటును మార్చుకోవాలి. తమకు తాము విలువ ఇచ్చుకోవడం చాలా అవసరం. సాధించిన విజయాలను గర్వంగా స్వీకరించాలి’ అని అన్నారు.
ఆ రోజులు రావాలి
సినిమా ఇండస్ట్రీలో మహిళలు..తగిన గుర్తింపు సంపాదించుకోవడానికి రెట్టింపు కష్టం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఒక రిస్క్ లాగా లేదా ఒక ప్రత్యేక కేటగిరి లాగా చూస్తున్నారు. ఆ రోజులు పోవాలి. వాటిని కూడా డిఫరెంట్ కథలు అని చెప్పుకునే రోజులు రావాలి.తెరపై మహిళలు కేవలం హీరోకి భార్యగానో .. హీరోకి ధైర్యం చెప్పడానికో పరిమితం కాకుండా నిజజీవితంలో ఉండే మహిళల లాగానే క్లిష్టమైన మనస్తత్వంతో ఉండాలి’అని సమంత తెలిపింది.
సారీ..అక్కర్లేదు
పురుషులతో పోలిస్తే.. మహిళలే ఎక్కువ సార్లు క్షమాపణలు కోరుతున్నారు. ఒకే పరిస్థితిలో పురుషుల కంటే మహిళలు దాదాపు పది రెట్లు ఎక్కువ సారీ అంటారని మీకు తెలుసా?, ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి ఒక సూచనగా పరిగణించవచ్చు. ప్రతి చిన్న విషయానికి క్షమాపణలు కోరాల్సిన అవసరం లేదు. ఇక చాలు.. మహిళలు ఇలా తమని తాము తగ్గించుకోవడం ఆపాలి.క్రెడిట్ తీసుకోవడం తప్పు కాదు. అంబిషన్ ఉండటం తప్పు కాదు. ఎవరో పొగిడితే సింపుల్‌గా థాంక్యూ అనడం అహంకారం కాదు. మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని అనుభవించే హక్కు పూర్తిగా మీకు ఉంది’ అని సమంత చెప్పుకొచ్చింది.


