అందుకోసం భయపడతాను.. భయపెడతాను

RRR team and Rajamouli to interact with Telugu media  - Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఎలా ఆరంభం అయింది? ఆర్టిస్ట్‌లను రాజమౌళి ఎందుకు టార్చర్‌ పెడతారు? ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, సీత పాత్ర చేసిన ఆలియా భట్‌ షూటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి ఏమన్నారు? ఆలియా తెలుగులో ఏం మాట్లాడారు? అసలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విశేషాలేంటి?

వచ్చే జనవరి 7న ఈ చిత్రం రిలీజ్‌ కానున్న సందర్భంగా శనివారం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, హీరోయిన్‌ ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య మీడియా ముందుకొచ్చారు. ఎన్టీఆర్‌ని చరణ్‌ గిచ్చడం, చరణ్‌కన్నా తారక్‌ ఒక ఏడాది పెద్ద అని రాజమౌళి అంటే, ఇప్పుడు నా వయసు సంగతి ఎందుకు? అని ఎన్టీఆర్‌ చిరుకోపం ప్రదర్శించడం... ఇలా సరదాగా సాగిన ఈ సమావేశంలో ఎవరేమన్నారో తెలుసుకుందాం.

ఇద్దరికీ ఒకేసారి కథ చెప్పా   – రాజమౌళి
ఒక రోజు తారక్, చరణ్‌లను మా ఇంటికి పిలిచాను. ‘మీ ఇద్దరితో సినిమా చేయాలనుకుంటున్నా’నని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్టోరీ అవుట్‌లైన్‌ చెప్పాను. విన్నాక చరణ్, తారక్‌ల ఎక్స్‌ప్రెషన్స్‌ మామూలుగా లేవు. సినిమా చేద్దామనుకున్నాక మేం ముగ్గురం ఉన్న ఫోటోను షేర్‌ చేశాను.

నేను స్టార్‌ వేల్యూ తెలిసిన డైరెక్టర్‌ని. స్టార్లను అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చినట్లు చూపిస్తూ ఇంత పెద్ద డైరెక్టర్‌ అయ్యాను. ప్రేక్షకులను స్టార్స్‌ థియేటర్లకి రప్పించగలరు. కానీ ఒక్కసారి థియేటర్స్‌లో సినిమా మొదలయ్యాక స్టార్స్‌ మాయమైపోతారు. కథే ఆ సినిమాను నడిపించాలని నమ్ముతాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ప్రేక్షకులను రప్పించడానికి స్టార్స్‌గా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ఉపయోగపడతారు. కానీ సినిమాలోని కథను, అందులోని పాత్రలను చూపించడానికి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లోని యాక్టర్స్‌ కావాలి నాకు. అలా ఎన్టీఆర్, చరణ్‌లోని యాక్టర్స్‌ను తీసుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో స్నేహాన్ని చూపించగలిగితే  సినిమాను చూసేవారు కూడా వారి స్నేహానికి మాత్రమే స్పందిస్తారని, ఎన్టీఆర్, తారక్‌లను కాదని నమ్మి ఈ చిత్రం చేశాను. నా మనసులో అనుకున్నదాన్ని స్క్రీన్‌ పై తీసుకువచ్చేందుకు చాలా భయపడతాను... మదనపడతాను. విజువల్‌గా నేను ఊహించుకున్న అవుట్‌పుట్‌ కోసం నా సాంకేతిక నిపుణులను భయపెడతాను.. ఆర్టిస్టులను టార్చర్‌ పెడతాను. అదృష్టవశాత్తు నేనెంత టార్చర్‌ పెట్టినా, భయపెట్టినా.. వారు మనసులో నన్ను తిట్టుకున్నా నేననుకున్నది చేసి పెడుతున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు. దేశభక్తి అంతర్లీనంగా కనిపిస్తూ, స్నేçహాన్ని చూపించే కథ. బయోపిక్స్‌ తీస్తే వారికి సంబంధించిన కుటుంబసభ్యులను కలవాలి. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ 95 శాతం ఢిల్లీలో జరుగుతుంది. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? అనే కల్పిత కథతో తీసిన సినిమా ఇది. అయితే కొమురం భీమ్‌ పాత్ర కోసం 1920లో ఆదిలాబాద్‌లో నివసించిన గోండు జాతివారి మానసిక స్థితి ఎలా ఉండేది? ఒకవేళ వారికి ఒక కాపరి ఉంటే అతను ఎలా ఉంటాడు? అతను సిటీకి వస్తే ఎలాంటి నడవడికతో ఉంటాడు? అని కసరత్తులు చేశాం. చరణ్‌ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర గురించి కూడా పరిశోధన చేశాం. భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ ముస్లిం యువకుడిగా ఎందుకు క్యాప్‌ పెట్టుకున్నాడనే విషయాన్ని సినిమాలో చూపిస్తాం. 

ఈ సినిమాలో రామ్, భీమ్‌ అనే రెండు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకు నా కథ వర్కౌట్‌ అవ్వాలంటే హీరోలిద్దరి క్యారెక్టర్స్‌ పట్ల సమాన దృక్పథంతో ఉండాలి. ఈ ఇద్దరూ నవ్వితే ప్రేక్షకులూ నవ్వాలి.. ఏడిస్తే ఏడవాలి. అంతేకానీ తారక్‌కు ఎక్కువ ఫైట్స్‌ ఉన్నాయా? ఎన్టీఆర్‌కు ఎక్కువ ఫైట్స్‌ ఉన్నాయా? అని కాదు. అయితే వీటి గురించి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. కానీ ప్రేక్షకులు థియేటర్స్‌లో వీటి గురించి మర్చిపోతారనే అనుకుంటున్నాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రొమాన్స్‌ కన్నా.. బ్రోమాన్స్‌ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి స్నేహితుల అనుబంధాన్ని ఇలా కూడా తీయవచ్చా? అనేలా బ్రోమాన్స్‌ ఉంటుంది.

స్వాతంత్య్ర సమరయోధులతో ‘నాటు నాటు’ పాటలో డ్యాన్స్‌  చేయించారనే విమర్శలు వస్తాయని ఊహించాను. కానీ ఇంతటి నాటు పాటలో కూడా ఎమోషన్‌ ఉంటుంది. ఈ పాటను థియే టర్స్‌లో చూసినప్పుడు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టుకున్న ఇద్దరు డ్యాన్స్‌ చేస్తున్నారన్న ఆలోచన ప్రేక్షకులకు రాదు.

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ‘దోస్తీ’ పాట రాశారు. కథ, అందులోని పాత్రలు, పాట వచ్చే సందర్భాలను వివరించినప్పుడే సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో పాట రాయించుకోగలం.

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో మాత్రమే ఎన్టీఆర్, చరణ్‌ డబ్బింగ్‌ చెప్పారు. మిగతా భాషలు, విదేశీ భాషల్లో ఆ భాషల ఆర్టిస్టులు డబ్బింగ్‌ చెప్పారు.

రాజమౌళిగారు కనిపించని టైగర్‌  – ఎన్టీఆర్‌
గోండ్లలో జన్మించిన వ్యక్తి జీవనశైలి, ప్రవర్తన, నడవడిక ఎలా ఉంటుంది? ఇవన్నీ రాజమౌళిగారు చెప్పారు. కొమురం భీమ్‌ పాత్రను అర్థం చేసుకోవడానికి ఆయన బాగా హెల్ప్‌ చేశారు. నేను కూడా మెంటల్‌గా, ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యాను. అన్ని సినిమాలకు కష్టపడతాను. కాకపోతే ఈ సినిమాకు కాస్త ఎక్కువగా కష్టపడ్డాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్స్‌లో కనిపించని టైగర్‌ రాజమౌళిగారే. రాజమౌళి వంటి గొప్ప దర్శకుడు యాక్టర్స్‌గా మాకు గొప్ప హైప్‌ ఇస్తాడని కథను ఒప్పుకుంటాం. అంతేకానీ ఈ సినిమాతో ఇతర భాషల్లోకి కూడా వెళ్లొచ్చని ఆలోచించం. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందంటే అది బోనస్‌ మాత్రమే. ఈ సినిమా చేస్తున్న టైమ్‌లో మేం (రామ్‌చరణ్‌ని ఉద్దేశించి) ఫ్రెండ్స్‌ అవ్వలేదు... అంతకుముందే ఫ్రెండ్స్‌.

అలా చేస్తే వంద మార్కులు పడ్డట్లే!– రామ్‌చరణ్‌
ఈ సినిమాలో నా క్యారెక్టర్‌లో మూడు షేడ్స్‌ ఉన్నాయి. ప్రతి షేడ్‌కి కావాల్సిన భావోద్వేగాన్ని రాజమౌళిగారు స్క్రిప్ట్‌లో డిజైన్‌ చేశారు. సినిమా అంతా ఒకే ఫిజిక్‌  మెయిన్‌టైన్‌ చేయడానికి చాలా కష్టపడ్డాను. రాజమౌళిగారితో వర్క్‌ చేయడం ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన చెప్పింది యాక్టర్స్‌గా మేం చేస్తే అదే మాకు వంద మార్కులు. చిన్న చిన్న విభేదాలు వచ్చిన తర్వాత కూడా స్నేహం బలంగా ఉన్నప్పుడే అది నిజమైన స్నేహం అవుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తున్నాం కాబట్టి మేం (ఎన్టీఆర్‌ని ఉద్దేశించి) స్నేహితు లయ్యాం అని కాదు. ముందే ఫ్రెండ్స్‌. రాజమౌళిగారికి మేం చేసింది ఒక్కటే... స్క్రిప్ట్‌లో మా స్నేహాన్ని వెండితెరపై బాగా తీసుకురావడమే మేం చేసింది.

మాకు పిచ్చెక్కిపోయింది – ఆలియా 
సౌత్‌ సినిమాల్లో నటించకూడదని ఏ బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుకోదు. కథ నచ్చితే చేస్తారు. అలాగే నేను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో భాగమయ్యాను. దక్షిణాది ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేయాలని నన్ను నేను చాలెంజ్‌ చేసుకున్నాను. ఎన్టీఆర్, చరణ్‌ లవ్లీ కో స్టార్స్‌. చాలా హెల్ప్‌ చేశారు. రాజమౌళిగారితో వర్క్‌ చేయడంతో నా కల నిజమైనట్లుంది. ఆయనతో మరో సినిమా చేయాలని ఉంది. అలాగే ఐ లవ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (లవర్‌ రణ్‌బీర్‌ కపూర్‌ని ఉద్దేశించే ఆలియా ఇలా అన్నారని ఓ ఊహ). స్క్రిప్ట్‌ విన్నప్పుడు అందులోని కొన్ని భావాలను ఓ యాక్టర్‌గా కెమెరా ముందు చూపించడం అన్ని వేళలా కుదరదు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వల్ల ఈ విషయంలో నేను మెరుగయ్యాను. రాజమౌళిగారి సినిమాల్లో ఎమోషన్‌ స్ట్రాంగ్‌గా ఉంటుందని తెలుసుకున్నాను. కరోనా టైమ్‌లో తెలుగు భాష నేర్చుకోవడానికి  జూమ్‌లో క్లాసులకు హాజరయ్యాను’’ అంటూ ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ పగిలిపోయింది. ముంబైలో మాకు పిచ్చెక్కిపోయింది’’ అని తెలుగులో మాట్లాడి అలరించారు ఆలియా.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top