రేణూ దేశాయ్‌కు కరోనా?: నటి స్పందన

Renu Desai Shares Her Coronavirus Report - Sakshi

నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టొస్తుందట. ఊరేంటి ఈ విశ్వాన్నే చుట్టేస్తోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా వచ్చాక నిజానికి, అబద్ధానికి మధ్య ఉన్న సన్న గీత చెరిగిపోయినట్లైంది. అంతే కాదు సత్యాల కన్నా అసత్యాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. నిజానిజాలు తెలీకుండానే అపోహలను నమ్మేస్తూ అదే నిజమని తెగ షేరింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో పపన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌కు కరోనా సోకిందంటూ ఓ వార్త తెగ వైరల్‌ అయింది. దీంతో కలవరపడ్డ కొందరు పవన్‌ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేశారు. దీంతో ఈ విషయంపై స్పందించిన రేణూ దేశాయ్‌ తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన కరోనా రిపోర్టును కూడా షేర్‌ చేశారు. 

"నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నిన్న ఓ ఫంక్షన్‌కు వెళ్తే అందరూ నన్ను అదోలా చూశారు. నాకసలు బాధ్యత లేని మనిషిని అన్నట్లుగా చూపులతో గుచ్చారు. అందుకే ఈ పోస్టు పెడుతున్నా. నాకు కరోనా వస్తే ఆ విషయాన్ని స్వయంగా నేనే వెల్లడిస్తాను, అంతేకాదు బాధ్యత గల వ్యక్తిగా ఎటువంటి కార్యక్రమాలకు కూడా హాజరవను" అని తేల్చి చెప్పారు. తనకు కరోనా అంటూ తప్పుడు వార్తలను రాసినవారిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది నిజం? ఏది అబద్ధమో తెలుసుకుని రాయండని అసహనానికి లోనయ్యారు. ఇలా అడ్డదిడ్డంగా రాసే వార్తలను నమ్మకండని అభిమానులకు సూచించారు. వాళ్లు కేవలం సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాస్తూ బతుకుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పుట్టలు సృష్టించే అకౌంట్లను అస్సలు ఫాలో అవకండని మరీ మరీ చెప్పారు.

'చాలామంది ఈ విషయం గురించి పట్టించుకోకండని చెప్పారు. కానీ కరోనా జోక్‌ చేసుకునేంత చిన్న విషయం కాదు. ఇది చాలా సీరియస్‌ విషయం. అందుకే నేను మౌనంగా ఉండలేకపోయాను. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను దయచేసి నమ్మకండి అని కోరారు. ఇదిలా వుంటే బద్రి, జానీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్‌ 'ఆద్య' అనే పవర్‌ఫుల్‌ లేడీ ఓరియెంటెడ్‌ ప్యాన్‌ ఇండియా చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాతో ఎం.ఆర్‌ కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయం అవుతుండగా డీఎస్‌ రజనీకాంత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: అకిరా, ఆధ్యతో పవన్‌.. మురిసిపోతున్న రేణు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top