
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ వారికి కోపం తెప్పిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా రష్మికపై మండిపడుతున్నారు. మీ అజ్ఞానాన్ని అందరిపై రుద్దొద్దని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అసలు రష్మిక చేసిన కామెంట్స్ ఏంటి? ఎందుకింతలా వ్యతిరేకత వస్తుందో? మీరు కూడా చూసేయండి.
నేను ఫస్ట్ అంటూ కామెంట్స్..
ఇటీవల రష్మిక మందన్నా.. కూర్గ్ జిల్లాలోని కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నటిని అని తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది. ఈ వ్యాఖ్యలే రష్మికను టార్గెట్ చేసేలే చేశాయి. ఆమె కామెంట్స్‌పై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. ఎందుకంటే ఆమె కంటే ముందు పలువురు నటీనటులు కూర్గ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. మీ కంటే ముందుగానే 1990ల్లోనే నెరవంద ప్రేమ కూర్గ్ నుంచి వచ్చారని చురకలంటించారు. అంతేకాకుండా నీ కంటే ముందు నుంచే గుల్షన్ దేవయ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారని గుర్తు చేశారు.
రష్మిక చేసిన కామెంట్స్‌పై నటి ప్రేమ కూడా స్పందించింది. ఈ విషయంలో నేను ఏమి చెప్పగలను? కొడవ సమాజానికి నిజమేంటో తెలుసు.. ఆమె వర్షన్ గురించి తననే అడగాలని సూచించింది. కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సుగమం చేశారని ప్రేమ వెల్లడించారు.
ప్రేమ మాట్లాడుతూ..' రష్మిక సినిమాల్లోకి రాకముందే ఇతరులు ఆమెకు మార్గం సుగమం చేశారు. నా కంటే ముందు కూర్గ్‌కు చెందిన శశికళ అనే నటి సహాయక పాత్రలు పోషించింది. అప్పుడే నేను చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించా. ఆ తరువాత చాలా మంది కొడవ వాళ్లు బాగా రాణించారు.' అని అన్నారు. కాగా.. ప్రేమ 1990ల్లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. తన నటనకు గానూ కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది.
రష్మికపై నెటిజన్ల ట్రోల్స్..
రష్మిక కామెంట్స్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రోల్స్ వచ్చాయి. ఆమె కంటే ముందే ప్రేమ, నిధి సుబ్బాయ్య, హరిషిక పూనాచా, తనీషా కుప్పందా లాంటి వాళ్లు సినిమాల్లో నటించారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కూర్గ్ నుంచి వచ్చిన మొదటి నటినని చెప్పడం వందశాతం తప్పు.. ఎందుకంటే రష్మిక రాకముందే 5 నుంచి 6 మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రేమ మేడమ్ ఓం అనే కన్నడ సినిమాలో నటించినప్పుడు రష్మిక అస్సలు పుట్టలేదని మరో నెటిజన్ రాశారు. రష్మిక బహుశా నీకు నువ్వే గొప్ప అనుకోవచ్చు.. కానీ గుల్షన్ దేవయ్య కూడా గొప్పగా నటించాడనే విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు అంటూ ప్రశ్నించాడు.