విశ్వంలో అత్యంత పురాతన శక్తి.. ‘బ్రహ్మాస్త్ర’

Ranbir Kapoor Brahmastra Motion Poster And Release Date is out - Sakshi

మన విశ్వంలో ఏదో జరుగుతోంది.. అది సామాన్యుల ఊహకు కూడా అందనిది.. అత్యంత పురాతన మహా శక్తి.. అదో అస్త్రం.. అదేంటి? అంటూ ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం కూడా ఒకటి.

2018లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా ఇతరత్రా సమస్యల కారణంగా చాలా రోజులుగా సెట్స్‌పైనే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ డిసెంబర్‌తో చిత్రీకరణ పూర్తి చేసుకుంటుందని సమాచారం. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, డింపుల్‌ కపాడియా, అక్కినేని నాగార్జున తదితర అగ్ర తారలు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఇక తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌ పోషించిన శివ పాత్రకి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో విశ్వం నుంచి భగభగమండే అగ్ని నుంచి రణ్‌బీర్‌ కపూర్‌లోకి ఓ శక్తి రావడం, అది త్రిశూలంగా మారడం, శివుడిలా రణ్‌బీర్‌ త్రిశూలం పట్టుకుని పవర్‌ ఫుల్‌ లుక్‌ ఇవ్వగా, వెనకాల ఏకంగా మహా శివుడి రూపం ప్రత్యక్షం కావడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక మోషన్‌ పోస్టర్‌లో ‘బ్రహ్మాస్త్ర’ ‘సారే అస్త్రే కే దేవతా’ అని ఉంది. బ్రహ్మాస్త్రం అనేది తిరుగులేని అస్త్రం అని దాని అర్ధం.

దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ సూపర్‌ హీరో తరహా పాత్రతో సందడి చేయనున్నారని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుందని మోషన్‌ పోస్టర్‌ ద్వారా చిత్ర బృందం తెలిపింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top