
'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. తర్వాత సినిమా 'గేమ్ ఛేంజర్'తో అందరినీ పూర్తిగా నిరాశపరిచాడని చెప్పొచ్చు. అయితేనేం 'పెద్ది' మూవీతో అదిరిపోయే రేంజులో అదరగొట్టేయబోతున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఇదివరకే వచ్చిన గ్లింప్స్ ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయేలా మరో అప్‌డేట్ వచ్చేసింది.
త్వరలో 'పెద్ది' కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలుకాబోతుంది. ఇందుకోసం జిమ్‌లో చరణ్ చెమటలు చిందిస్తున్నాడు. మొత్తంగా హ్యాండ్స్, బైసెప్స్ లాంటివి కాస్త గట్టిగానే పెంచుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో చరణే పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం అని ఫిక్సయిపోతున్నారు.
(ఇదీ చదవండి: ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్)
బుచ్చిబాబు తీస్తున్న 'పెద్ది' చిత్రాన్ని రూరల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇందులో చరణ్.. క్రికెట్, కబడ్డీ ఆటగాడి పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు కనిపిస్తున్న బాడీ.. యాక్షన్ సన్నివేశాల కోసమనిపిస్తోంది. ఈ రేంజు బాడీతో ఫైట్ సీన్స్ అంటే విలన్స్ గాల్లోకి లేస్తారేమో?
'పెద్ది' సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రోజురోజుకి హైప్ పెంచుతున్న ఈ మూవీ నుంచి ముందు ముందు ఇంకెన్ని సర్‌ప్రైజులు వస్తాయో చూడాలి.
(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు)