
ప్రేయసితో కలిసి పుణేలో ల్యాండ్ అయ్యాడు పెద్ది. అక్కడి అందమైన పరిసరాల్లో ఇద్దరూ ఆటా పాటా మొదలుపెట్టారు. రామ్‌చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించినదే ఈ ఆటా పాటా. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ పుణేలో ఆరంభమైంది.
ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ పై ఓ పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. చిత్రసంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ రత్నవేలు.