ఆ పాత్ర వస్తే కథ వినకుండానే ఓకే చేస్తా

Ram Charan Attended Guest In Cyberabad Commissionerate Sports Meet - Sakshi

ముగిసిన సైబరాబాద్‌ స్పోర్ట్స్‌ మీట్‌  

సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్‌): పోలీస్‌ పాత్రంటే కథ వినకుండానే ఓకే చేస్తానని సినీనటుడు రామ్‌చరణ్‌ తేజ్‌ పేర్కొన్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ధ్రువ సినిమాలో ఐపీఎస్‌ ఆఫీసర్‌గా నటించేందుకు చాలా కష్ట పడ్డానని చెప్పారు. సినిమా చూసిన పోలీసులు నవ్వుకోకుండా ఉండేందుకు సెల్యూట్‌ నుంచి డ్రెస్‌ వేసుకోవడం వరకు ఎన్నోసార్లు ప్రాక్టీస్‌ చేశానని గుర్తు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోనూ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నానని పేర్కొన్నారు. పోలీసులపై ఉన్న గౌరవంతోనే అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న తాను గంటన్నర పాటు మేకప్‌ తొలగించుకుని ఇక్కడికి వచ్చానని చెప్పారు. కోవిడ్‌ సమయంలో 10 నెలల పాటు పోలీసులు, డాక్టర్లు అంకితభావంతో పని చేశారని కొనియాడారు.

సైబరాబాద్‌ పోలీసుల స్పోర్ట్స్‌ మీట్‌లో టగ్‌ ఆఫ్‌ వార్‌ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మార్చ్‌ఫాస్ట్‌ చూస్తుంటే స్కూల్‌ రోజులు గుర్తుకు వచ్చాయన్నారు. తాను కూడా ఎల్లోస్‌ టీమ్‌లో మార్చ్‌ ఫాస్ట్‌ చేసేవాడినని, బ్యాండ్‌ సైతం నేర్చుకున్నట్లు చెప్పారు. సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మాట్లాడుతూ.. స్పోర్ట్స్‌ మీట్‌లో ఏడు జట్లు పాల్గొన్నాయని, తొలిసారి మినిస్ట్రీయల్‌ సిబ్బందికి అవకాశం కల్పించామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జాతీయ అథ్లెటిక్‌ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్‌ నాగపురి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, డీసీపీలు పద్మజ, విజయ్‌ కుమార్, ఎస్‌ఎస్‌సీ కార్యదర్శి కృష్ణ ఏదుల, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top