జయరాజ్‌ తర్వాతే ప్రభాసే.. ప్రపంచమంతా బన్నీ డైలాగే : ఆర్‌. నారాయణమూర్తి

R Narayana Murthy Interesting Comments On Prabhas And Allu Arjun - Sakshi

పీపుల్ స్టార్ ఆర్‌.నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలే ఆయనకు ప్రపంచం. డబ్బుల కోసం కాకుండా సమాజం కోసం మంచి సందేశాత్మక సినిమాలు తీస్తూ దర్శకుడిగా.. నిర్మాతగా.. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఆయనకు అమితమైన ప్రేమ. టాలీవుడ్‌కి చెందిన హీరోలు కానీ, దర్శకులు కానీ మంచి స్థాయిలో రాణిస్తే.. ఆయన మురిసిపోతాడు. బహిరంగంగానే వారిని అభినందిస్తాడు. తాజాగా ప్రభాస్‌, అల్లు అర్జున్‌లపై ఆర్‌ .నారాయణ మూర్తి ప్రశంసల వర్షం కురిపించాడు. 

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన‌ శ్యామ్ సింగ రాయ్ డిసెంబర్‌ 24న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్‌ హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్‌.నారాయణ మూర్తి..  ప్రభాస్‌, బన్నీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప హీరోలు ప్రభాస్‌, అల్లు అర్జున్‌ అని కొనియాడాడు. 

‘మంచి సినిమాలు వస్తే కరోనాను సైతం లెక్కచేయకుండా థియేటర్స్‌కి వస్తామని  తెలుగు ప్రేక్షకులు ‘అఖండ’తో మరోసారి నిరూపించారు. కరోనా టైం లో కూడా ‘అఖండ’, ‘పుష్ప’, ‘శ్యామ్ సింగ రాయ్’ తో థియేటర్స్ కళ కళ లాడాయి. యావత్ భారత దేశంలో నంబర్ వన్ సినీ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ, సెల్యూట్ గర్వించదగిన విషయం. గత రోజుల్లో తమిళనాడు నుంచి కానీ, ముంబై నుంచి కానీ దర్శకులు, హీరోలు వస్తుంటే ఇక్కడ తెలుగు మీడియా బాగా కవర్‌ చేసేది. ఆ దశ మన తెలుగు వారికి ఎప్పుడు వస్తుందో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు యావత్‌ యావత్ భారత దేశంలో నంబర్ వన్ సినీ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు రచయితలు, తెలుగు దర్శకుడు, హీరోలు ప్రపంచాన్ని ఏలుతున్నారు. మనవాళ్లు ఎక్కడికి వెళ్లిన మీడియా వస్తుంది.

కే విశ్వనాథ్‌ శంకరాభరణం తీసి ప్రపంచ సినీ చిత్రపటం మీద తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనం చెప్పాడు. తర్వాత ఒక బాహుబలి తీసి మన రాజమౌళి తెలుగువారి సత్తా చాడాడు. ఆల్‌ ఓవర్‌ ఇండియాలో మన తెలుగు హీరోలెవరూ స్టాండ్‌ కాలేదు. ఇంతకుముందు ఒకరు అయ్యారు. దటీజ్‌ పైడి జయరాజ్‌. బాలీవుడ్‌లో  తన సత్తాను చాటుకోవడమే కాకుండా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకొన్నారు. ఆ తర్వాత రేఖ, వైజయంతి మాలా, శ్రీదేవి లాంటి వాళ్లు హీరోయిన్లు సక్సెస్ అయ్యారు. కానీ హీరోలు ఎవరూ అక్కడ జెండా ఎగురవేయలేకపోయారు. కానీ బాహుబలి దెబ్బకు ప్రభాస్ దుమ్ముదులుపుతున్నాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయికి వచ్చినందుకు ప్రభాస్‌కు మనంతమంతా సపోర్ట్ ఇవ్వాలి 

అల్లు అర్జున్‌కి మలయాళంలో ఎంతో క్రేజ్ వుంది. ఇటీవల కేరళకు వెళ్లి చాలా చిన్న హోటల్ దిగాను. అప్పుడు ఇక్కడ టాప్ హీరోలు ఎవరు అని అడిగితే.. మోహన్ లాల్, మమ్ముట్టి, అల్లు అర్జున్ అని చెప్పారు. మలయాళంలో మన తెలుగువాడి సత్తా ఇది. ఒకప్పుడు షోలో, జంజీర్, భాషా సినిమాల్లో అమితాబ్, రజనీకాంత్ డైలాగ్స్ చెప్పుకొనే వారు. కానీ పుష్ప తర్వాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్  చెప్పిన ‘తగ్గేదే లా’ అనే మాటని ప్రపంచం అనుకరిస్తూ ఉంది.  అది మన తెలుగు హీరోల ఘనత’ అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top