ప్రభాస్‌ రెమ్యునరేషన్‌లో భారీ కోత.. ‘రాజాసాబ్‌’కి ఎంతంటే? | Prabhas Remuneration Detalis For The Raja Saab Movie | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ రెమ్యునరేషన్‌లో భారీ కోత...ఇక నెం1 కాదా?

Jun 21 2025 4:09 PM | Updated on Jun 21 2025 5:11 PM

Prabhas Remuneration Detalis For The Raja Saab Movie

టాలీవుడ్‌లో నిన్నా మొన్నటి దాకా నెంబర్‌ వన్‌ హీరో అంటే తడుముకోకుండా చెప్పగలిగిన పేరు ప్రభాస్‌(Prabhas). దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన బాహుబలి 2 సినిమాలు ప్రభాస్‌ స్టార్‌ డమ్‌ని మిగిలిన హీరోలకు అందనంత స్థాయికి తీసుకెళ్లిపోయాయి. టాలీవుడ్‌ ను దాటేసి పాన్‌ ఇండియా స్థాయికి ఎగబాకిన క్రేజ్‌తో ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అటు రెమ్యునరేషన్‌ పరంగా గానీ, అఖిలభారత స్థాయి ఇమేజ్‌ పరంగా గానీ చూస్తే టాప్‌లో నిలిచాడు ప్రభాస్‌. అయితే ఇదంతా ఇప్పుడు గతం. ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాల తర్వాత ప్రభాస్‌ నెంబర్‌ వన్‌ స్థానం బీటలు వారింది. ఆ స్థానానికి అల్లు అర్జున్‌ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. ఈ నేపధ్యంలో రెమ్యునరేషన్‌ పరంగానూ ప్రభాస్‌ తగ్గాడనే వార్త ఒకటి సినిమా పరిశ్రమలో వినిపిస్తోంది.

భారీ రెమ్యునరేషన్‌ తీసుకునే స్టార్‌ హీరోల్లో ముందుండే ప్రభాస్, మళ్లీ హారర్‌ కామెడీ మూవీ ‘ది రాజా సాబ్‌’(The Raja Saab Movie)  అనే సినిమాతో తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. హాస్య చిత్రాలకు పేరొందిన మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి  ప్రభాస్‌ అందుకున్న పారితోషికం గురించి వినిపిస్తున్న వార్తలు ప్రభాస్‌ నెంబర్‌ వన్‌ స్థానాన్ని చర్చనీయాంశంగా మార్చాయి.

బాహుబలి తర్వాత సాధారణంగా ఒక్క సినిమాకు రూ.150 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడట ప్రభాస్, అలాంటిది ఈ ప్రాజెక్ట్‌ కోసం మాత్రం రూ.100 కోట్లకే ఓకే చెప్పినట్లు సమాచారం. అంటే ఏకంగా రూ.50 కోట్ల తగ్గింపుని ఆయన అంగీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ముందు  విడుదలైన ‘ఆదిపురుష్‌’ సినిమా భారీగా వసూళ్లు సాధించలేకపోవడం, ప్రభాస్‌ నటన, గెటప్‌ కూడా తీవ్రంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొనడం వంటి వాటి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.

ఏదేమైనా ఇది ప్రభాస్‌ నెం1 స్టార్‌ ఇమేజ్‌ని సందేహాస్పదం చేసేదే. అయితే రెమ్యునరేషన్‌లో తగ్గింపును  అంగీకరిస్తూన్న కొందరు ప్రభాస్‌ అభిమానులు చెబుతున్న ప్రకారం...ఇది ఇమేజ్‌కు సంబంధించినది కాదు. ‘ది రాజా సాబ్‌’ కు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణ బాధ్యతలు చూస్తోంది. ఇదే సంస్థ ఆదిపురుష్‌ ను కూడా నిర్మించింది. కాబట్టి  ఆది పురుష్‌ ద్వారా నష్టాలను ఎదుర్కున్న నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభాస్‌  తన వంతుగా ఈసారి కొంచెం వెనక్కి తగ్గారని అంతే తప్ప ఆయన క్రేజ్‌కు ఏ మాత్రం తగ్గింపు లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పుష్ప సిరీస్‌తో మంచి దూకుడు మీదున్న బన్నీ... అట్లీ  సినిమాకు భారతీయ సిని చరిత్రలోనే ఎవరూ అందుకోనంత రెమ్యునరేషన్‌ అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభాస్‌ ఇలా వెనుకడుగు వేయడం టాలీవుడ్‌ నెం1 ఫైట్‌ను ఆసక్తిగా మారుస్తోంది.

ఇక ది రాజా సాబ్‌  సినిమా విషయానికి వస్తే.. రొమాంటిక్‌ హారర్‌ కామెడీగా భారీ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ తో తెరకెక్కుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు మారుతి కి ఇది ఓ పెద్ద స్కేల్‌ ప్రాజెక్ట్‌ కానుండగా, నిర్మాతగా టీ.జి. విశ్వప్రసాద్‌ వ్యవహరిస్తున్నారు.  సినిమా విడుదల తేదీని డిసెంబర్‌ 5, 2025 గా ప్రకటించారు.  ఈ సినిమా మరోసారి తమ హీరో సత్తా ఏంటో చూపించనుందని ప్రభాస్‌ అభిమానులు బల్ల గుద్ది చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement