'మీ చేతిలో సినిమాలు లేనప్పుడే గుర్తుకొచ్చిందా..? మైత్రి నిర్మాత కౌంటర్ | Mythri Movie Makers Ravi Shankar Responds On Percentage System | Sakshi
Sakshi News home page

Ravi Shankar: అప్పుడు వాళ్ల కష్టాలు కనపడలేదా సార్??.. శిరీష్‌కు రవిశంకర్ కౌంటర్

May 13 2026 6:36 PM | Updated on May 13 2026 7:09 PM

Mythri Movie Makers Ravi Shankar Responds On Percentage System

టాలీవుడ్‌లో పర్సంటేజీ విధానంపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచే ‍ప్రసక్తే లేదని నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్ల బతుకులు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. నిర్మాతలంతా మా బాధలను అర్థం చేసుకోవాలని అన్నారు. ‍ప్రభుత్వం జీవోలు ఇచ్చినా సరే టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని అన్నారు.

తాజాగా శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పందించారు.  మీ చేతిలో పెద్ద సినిమా లేకపోవడంతో ఇప్పుడు పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని అనడం కరెక్ట్ కాదని అన్నారు. హరిహర వీరమల్లు నుంచి ఈ సమస్య మొదలైందని తెలిపారు. ఆ తర్వాత వార్ 2, కూలీ, ఓజీ, అఖండ, నారీ నారీ నడుమ మురారి, చిరంజీవి మూవీ కూడా రిలీజ్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు మీకు ఎగ్జిబిటర్ల కష్టాలు కనపడలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మీ చేతిలో సినిమా లేకపోతే పర్సంటేజీ అని డిమాండ్ చేయడం మంచిది కాదన్నారు. ఏదైనా ఉంటే కూర్చోని మాట్లాడుకుందామని రవిశంకర్ అన్నారు. యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రవిశంకర్ మాట్లాడారు. పెద్ది సినిమా నుంచే పర్సంటేజ్ కావాలని పట్టు పడుతున్నారు.. కానీ నిర్మాతలకు సమస్యలు ఉన్నాయని తెలిపారు. వీటిపై కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు. ఈ ప్రెస్‌మీట్‌కు నాగవంశీ, సాహు గారపాటి, సతీశ్‌ కిలారు కూడా హాజరయ్యారు. 

కామెడీ కోసం ప్రెస్‌మీట్లు పెట్టకండి..నాగవంశీ

ఎగ్జిబిటర్ల పర్సంటేజీ విధానంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. 300 మల్టిప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఓ ఎగ్జిబిటర్, సింగిల్ స్క్రీన్స్ బాధలు చెబుతుంటే వినడానికి నవ్వొచ్చినా ఏమీ చేయలేకపోతున్నామని కౌంటరిచ్చారు. సీ సెంటర్ నుంచి బీ, ఏ సెంటర్ వరకు ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టిప్లెక్స్‌లు కట్టేశారని విమర్శించారు. సింగిల్ స్క్రీన్స్‌కు రావాల్సిన రెవెన్యూ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్స్ కష్టాలు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందని నిర్మాత నాగ వంశీ ఎద్దేవా చేశారు. పెద్ది సినిమా వస్తుంటే పూజలు చెయ్యాల్సింది పోయి ఇలా బెదిరించడం సరికాదన్నారు. 



 

Advertisement
 
Advertisement
Advertisement