ఎండల్లో హాయ్‌ హాయ్‌..అంటున్న స్టార్స్‌.. సమ్మర్‌ టార్గెట్‌గా భారీ సినిమాలు

Movie Festival in Summer - Sakshi

ఏప్రిల్‌లో సినిమాల జోరు

వేసవి వస్తోందంటే సినిమాల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో సినిమాకి వెళుతుంటారు. మండే ఎండల్లో కూల్‌ కూల్‌గా ఏసీ థియేటర్లో కూర్చుని సినిమాని ఆస్వాదిస్తుంటారు. అందుకే సమ్మర్‌ టార్గెట్‌గా ఎక్కువ సినిమాలు సిల్వర్‌ స్క్రీన్‌కి వస్తుంటాయి. ఈ ఏప్రిల్‌లో తొమ్మిది సినిమాలకుపైగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ‘మే’కి మాత్రం  ఇప్పటికి విడుదల తేదీ ఖరారైన సినిమా ఒకే ఒక్కటి ఉంది. నాగచైతన్య ‘కస్టడీ’ మే 12న విడుదల కానుంది. మరి.. ఏప్రిల్‌లో విడుదల కానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం... 

  ‘ధమాకా’ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లో చేరారు హీరో రవితేజ. దీంతో ఆయన నటిస్తున్న తర్వాతి సినిమా ‘రావణాసుర’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ, అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొం దుతున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌పాత్రలో కనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు.

  వైవిధ్యమైన కథలు, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ‘అల్లరి’ నరేశ్‌. వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి చిత్రాల్లో సీరియస్‌ రోల్స్‌లో నటించారు. ప్రస్తుతం నరేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో ఎమోషనల్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిర్నా మీనన్  హీరోయిన్‌. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ మూవీని ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. 

నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ . కదిరేశన్‌∙స్వీయ దర్శకత్వంలో ఫైవ్‌స్టార్‌ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై రూపొం దిన ఈ తమిళ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ సినిమాని గత ఏడాది డిసెంబర్‌ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ ప్రకటించినా వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్‌ కాలేదు. ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు కొత్త డేట్‌ ప్రకటించింది యూనిట్‌.

♦  సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న 15వ చిత్రం ‘విరూపాక్ష’. బైక్‌ ప్రమాదం నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై బీవీఎస్‌ఎ న్  ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 1990 నేపథ్యంలో ఫారెస్ట్‌ బేస్డ్‌ విలేజ్‌లో జరిగే కథాంశంతో ఈ మూవీ రూపొం దుతోందని సమాచారం.

♦  అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్నపాన్‌ ఇండియా చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షీ వైద్య కథానాయికగా చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్‌ 28న రిలీజ్‌ కానుంది. స్పై థ్రిల్లర్‌గా రూపొం దుతోన్న చిత్రమిది. ఈ మూవీ కోసం సిక్స్‌ప్యాక్‌ దేహం, పొడవాటి హెయిర్‌ స్టైల్‌తో స్టైలిష్‌గా మేకోవర్‌ అయ్యారు అఖిల్‌. ఫారిన్‌లో చిత్రీకరించే ఓ ఫైట్‌తో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని తెలిసింది.

♦  ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన హిస్టారికల్‌ మూవీ ‘పొన్నియిన్‌ సెల్వన్‌ (పీఎస్‌– 1)’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు మణిరత్నం. తొమ్మిదో శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధానపాత్రల్లో నటించారు. లైకాప్రొ డక్షన్స్ , మద్రాస్‌ టాకీస్‌ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ‘పీఎస్‌ 1’ గత ఏడాది సెప్టెంబర్‌ 30నపాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలుగులో నిర్మాత ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేశారు. మలి భాగాన్ని ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్రయూనిట్‌ ఓ వీడియోను విడుదల చేసింది. 

♦  తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు పంజా వైష్ణవ్‌ తేజ్‌.  ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ తర్వాత తన నాలుగో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో చేస్తున్నారు వైష్ణవ్‌ తేజ్‌. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం గత ఏడాది జూన్‌ల్‌ ప్రారంభమైంది. తన కెరీర్‌లో తొలిసారి మాస్, యాక్షన్‌ మూవీ చేస్తున్నారు వైష్ణవ్‌ తేజ్‌. ఈ సినిమా ఏప్రిల్‌ 29న బాక్సాఫీస్‌ బరిలో నిలుస్తోంది. ∙ 

చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్‌’. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలిపాత్రలో కీర్తీ సురేష్‌ నటిస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేదు. మరి ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్‌ 14న ‘బోళా శంకర్‌’ రిలీజ్‌ అవుతుందా? మరో కొత్త డేట్‌ని అనౌన్స్‌ చేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాలి.

సమంత లీడ్‌ రోల్‌లో నటించినపాన్‌ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్‌ గుణశేఖర్‌. శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమకథను ఈ మూవీలో చూపిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top