Monal Gajjar: నాగ్‌ సినిమాలో మోనాల్‌.. తొలిసారి ఆ పాత్రలో బిగ్‌బాస్‌ బ్యూటీ!

Monal Gajjar To Act In Nagarjuna Bangarraju Film - Sakshi

బిగ్‌బాస్‌ షోకి వెళ్లొచ్చిన తర్వాత మోనాల్‌ గజ్జర్‌ దశ మారిపోయింది. అంతకు ముందు రెండు, మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చేసినా రాని క్రేజ్‌.. ఒక్క బిగ్‌బాస్‌ షోతో సంపాదించేంది. ప్రస్తుతం ఈ గుజరాతీ భామ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. షో నుంచి బయటకు రాగానే.. ఓ డ్యాన్స్‌ షోకి జడ్జిగా వ్యవహరించింది. అంతేకాదు అల్లుడు అదుర్స్‌ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో అదరగొట్టేసింది. ఇలా టీవీ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలంటూ తీరిక లేకుండా గడుపుతున్న ఈ భామకు తాజాగా మరో భారీ ఆఫర్‌ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
 
నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’సినిమా ఎంత విషయం సాధించిందో అందరికి తెలిసిందే. 2016 సంక్రాంతి పండక్కి వచ్చిన సినిమాల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన మూవీ ఇది.  దీంతో ఈ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర పేరుతోనే ప్రీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు కల్యాణ్‌ కృష్ణ. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగచైతన్య మరో హీరోగా నటిస్తారు. నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ, చైతూకి జంటగా కృతిశెట్టిలను తీసుకున్నారు. ఇప్పుడు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

కథ ప్రకారం సినిమాలో స్వర్గం ఎపిసోడ్ ఒకటి ఉంటుందట. ఇందులో కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఈ ఎపిసోడ్ లో మోనాల్ ఎంట్రీ ఇస్తుందట. స్వర్గంలో రంభగా ఆమె కనిపించబోతుందని సమాచారం. నాగార్జునతో కలిసి మోనాల్ వేసే స్టెప్పులు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  ఆగస్టు 20 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top