
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన చిత్రం 'కన్నప్ప'. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటించారు. అయితే ఈ మూవీ విడుదలై రెండు నెలల దాటినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. దీంతో ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్ను రివీల్ చేశారు. ఈనెల నాలుగో తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ సినిమాను అవా ఎంటర్ టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. థియేటర్లలో మిస్సయిన ఈ విజువల్ వండర్ను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
కన్నప్ప అసలు కథేంటంటే..
తిన్నడు(మంచు విష్ణు) పరమ నాస్తికుడు. అతని తండ్రి నాథ నాథుడు(శరత్ కుమార్) మాటే ఆయనకు వేదం. గూడెం ప్రజలకే ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడానికి చెందిన యువరాణి నెమలి(ప్రీతీ ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ఓసారి గూడెంలో ఉన్న వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు.
ఈ విషయం కాల ముఖుడికి తెలిసి.. గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు. అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని వీడాల్సి వస్తుంది. నెమలితో కలిసి అడవికి వెళ్తాడు. శివుడి పరమభక్తురాలైన నెమలి.. దేవుడినే నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు? వీరి జీవితంలోకి రుద్ర(ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం కోసం కాల ముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడు పరమ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.