
పశ్చిమ ఆఫ్రికాలోని ఐవోరియన్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు 'యాయా టౌరే' నెట్టింట వైరల్ అవుతున్నాడు. అందుకు ప్రధాన కారణం మహేష్ బాబు అతడు సినిమానే కావడం విశేషం. వివిధ మ్యాచ్‌లలో ఆయన చేసిన గోల్స్ ఒక వీడియోగా క్రియేట్ చేసి దానికి అతడు సినిమా బిజీఎమ్‌ను జోడించారు. ఆపై ఆడు మగాడ్రా బుజ్జి అంటూ తనికెళ్ల భరణి చెప్పే ఎలివేషన్ డైలాగ్స్‌ను కూడా మిక్స్ చేశారు. అయితే, ఆ వీడియోను చిన్నాచితక పేజీ షేర్ చేయలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీ (ఇంగ్లాండ్) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 'పెను తుఫాను తలొంచి చూసే… తొలి నిప్పు కణం అతడే ' అంటూ తెలుగు డైలాగ్‌ను కూడా షేర్ చేసింది. 56 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఆ పేజీలో ఒక తెలుగు సినిమాకు చెందిన బీజీఎమ్‌తో పాటు అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్స్ చేర్చడం విశేషం.

ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ జట్టుగా పేరుగాంచిన మాంచెస్టర్ సిటీ(Manchester City).. ప్రతిష్ఠాత్మకమైన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్(FIFA Club World Cup)- 2023 చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టీమ్‌కు చెందిన సోషల్‌మీడియా పేజీలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన డైలాగ్స్‌ను పంచుకోవడం గొప్ప విషయం. ఇప్పటికే ఆ వీడియో ఒక మిలియన్ వ్యూస్ చేరుకుంది.
మాంచెస్టర్ సిటీ షేర్ చేసిన వీడియోలో యాయా టౌరే కొడుతున్న గోల్స్‌కు తనికెళ్ల భరణి డైలాగ్స్ జత కావడంతో ట్రెండ్ అవుతుంది. యాయా టౌరే ప్రస్తుతం సౌదీ అరేబియా జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు .