
శేఖర్ కమ్ముల(Sekhar kammula)కు సెన్సిబుల్ దర్శకుడు అనే పేరుంది. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఇవ్వడం ఆయన స్టైల్. అందుకే సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని వచ్చినా.. శేఖర్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. లేట్‌గా వచ్చిన డిఫరెంట్ సినిమానే చూపిస్తాడనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది. లవ్‌స్టోరీ(2021) తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రం కుబేర(Kuberaa Movie Review). తొలిసారి ధనుష్(Dhanush), నాగార్జున లాంటి బడా హీరోలతో ఆయన ఈ సినిమా తెరకెక్కించాడు. నేషనల్ క్రష్ రష్మిక ఇందులో మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో కుబేరపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘కుబేరా’ కథేంటంటే..?
దీపక్ (నాగార్జున) నిజాయితీ గత సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. కోర్టుకు వెళ్లినా న్యాయం జరగదు. అదే సమయంలో తనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్‌ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ. 50 వేల కోట్లను వైట్‌లో మరో 50 వేల కోట్లను బ్లాక్‌లో బదిలీ చేయాల్సి ఉంటుంది(Kuberaa Movie Review).
దాని కోసం దీపక్ నలుగురు బిక్షగాళ్లను తీసుకొచ్చి, వాళ్ల పేరు మీద రూ. 10 వేల కోట్ల చొప్పున అకౌంట్‌లో జమ చేస్తాడు. వారిలో ఒక భిక్షగాడే దేవా(ధనుష్). పని ఇప్పిస్తామని చెప్పి తిరుపతి నుంచి ముంబైకి తీసుకొచ్చి.. దేవా పేరుపై డబ్బులు జమ చేస్తారు. ఆ డబ్బులను మళ్లీ కేంద్ర మంత్రుల బినామీకి బదిలీ చేయించే క్రమంలో దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు? నీరజ్ గ్యాంగ్ అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి? నీరజ్ గురించి దీపక్‌ని తెలిసి అసలు నిజం ఏంటి? కేంద్ర మంత్రులకు నీరజ్ మిత్రా రూ. లక్ష కోట్లను లంచంగా ఎందుకు ఇస్తున్నాడు? బిచ్చగాడైన దేవా..బడా వ్యాపారవేత్త నీరజ్‌కి చెప్పిన గుణపాఠం ఏంటి? చివరకి రూ. లక్ష కోట్లు చేతులు మారాయా లేదా? ఈ కథలో సమీరా(రష్మిక)పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సెన్సిబుల్ కథలో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడంలో శేకర్ కమ్ముల దిట్ట. సమాజంలో జరుగుతున్న పరిణామాలనే కథగా మలిచి.. ఎంటర్‌టైనింగ్‌గా చూపిస్తూనే ఒక మంచి సందేశం అందిస్తుంటాడు. అలా అని సందేశం ఇవ్వడానికి సినిమా తీసినట్లుగా అనిపించదు. సినిమా చూస్తే మనకే ఓ సందేశం అందుతుంది. కుబేర చిత్రాన్ని కూడా అలానే తెరకెక్కించాడు. కార్పోరేట్ వ్యవస్థలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయి? రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు? బ్లాక్ మనీ ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. దీని కోసం శేకర్ కమ్ముల చాలా లోతుగా అధ్యయనం చేసినట్లుగా సినిమా చూస్తే అర్థమవుతుంది.
అయితే ప్రతీ విషయం డీటేయిల్డ్‌గా చూపించాలనే తాపత్రాయంతో నిడివిని అమాంతం పెంచేశారు. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ చిత్రాన్ని దాదాపు అరగంటకు తగ్గించిన పర్వాలేదనిపిస్తంది. కట్ చేసినా పర్లేదు అనే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అదొక్కటే సినిమాకు పెద్ద మైనస్. అయితే ధనుష్ , నాగార్జున తమ నటనతో ఆ సాగదీతను కొంతమేర కప్పిపుచ్చుకొచ్చారు.
తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బిచ్చగాడు.. ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక ధనవంతుడు.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ నిజాయితీ ఆఫీసర్.. ఈ మూడు రకాల పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. ఆయిల్ స్కామ్ సన్నివేశంతో కథని ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నాగార్జున పాత్ర ఎంట్రీ, బ్లాక్ మనీ బదిలీ ప్లాన్.. బిచ్చగాళ్ల ఎంపిక.. ఇవన్నీ చకచక సాగిపోతాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత ధనుష్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది.
దేవా తప్పించుకుపోయిన తర్వాత కథనం పరుగులు పెరుగుతుంది. అతన్ని ఎలా పట్టుకుంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో నాటకీయత ఎక్కైవైనట్లుగా అనిపిస్తుంది. వ్యాపారవేత్త నీరవ్ మిత్రా బిచ్చగాడిలా మారడం.. అధికార బలం ఉన్నా బిచ్చగాడిని పట్టుకోలేకపోవడం.. సినిమాటిక్‌గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల శేకర్ లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. ఎప్పటి మాదిరే తను చెప్పాలనుకున్న కథను శేఖర్ కమ్ముల చాలా నిజాయితీగా చెప్పేశాడు.
ఎవరెలా చేశారంటే..
ధనుష్ నటన గురించి ప్రత్యేక్షంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతాడు. అలాంటి నటుడు శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి దొరికితే ఎలా ఉంటుంది? కొత్త నటీనటులతోనే అద్భుతంగా నటింపజేసే శేకర్.. ధనుష్‌లోని టాలెంట్‌ని పూర్తిగా వాడేశాడు. బిచ్చగాడు దేవ పాత్రలో నటించలేదు..జీవించేశాడు. తెరపై ఓ స్టార్ హీరో ఉన్నాడనే సంగతే గుర్తుకురాదు. బిచ్చగాడే మన కళ్లముందు కనిపిస్తాడు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకే అభినందించాలి. ఇక ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది. నాగార్జున కూడా ఇందులో డిఫరెంట్ పాత్ర పోషించాడు. సీబీఐ ఆఫీసర్ దీపక్‌గా చక్కగా నటించాడు. ఆయన కెరీర్‌లో ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. రష్మిక తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె ఎంట్రీ కామెడీగా ఉన్నా.. రాను రాను ఆమె పాత్ర ప్రాధాన్యత పెరుగుతుంది. విలన్‌గా జిమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్‌గా కనిపంచాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేవాడు. పాటలు సందర్భానుసారంగా వస్తుంటాయి. పోయిరా పోయిరా పాటతో పాటు అమ్మ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు బాగుంది. ముంబై సెట్‌తో పాటు ప్రతీది సహజంగా తీర్చిదిద్దారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో నిర్థాక్షిణంగా కట్ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్