
ఒకప్పుడు పౌరాణిక పాత్రలు ధరించిన తారలు...ఆ సందర్భంలో ఎంతో నిష్టగా ఉండేవారని విన్నాం. ఉపవాసాలు చేస్తూ, కటిక నేల మీద నిద్రపోతూ.. దేవుని పాత్రల్ని పండించిన నటీ నటులను కన్నాం. అది నటనే అయినప్పటికీ ప్రజల భావోద్వేగాలతో అనుసంధానమై ఉన్న దేవుళ్లలా కనిపించాలంటే నిజంగా అంతటి దైవభక్తి ఉంటే తప్ప ఆ పాత్రల్ని పండించడం సాధ్యం కాదని అప్పటి వారి భావన. కేవలం పాత్రల్ని పండించడం మాత్రమే కాదు ఆ తర్వాత కూడా తమ నడవడిక, ప్రవర్తన కొంతయినా పద్ధతిగా ఉండేలా జాగ్రత్త పడేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు అంతటి చిత్తశుద్ధిని ఈనాటి తారల్లో చూడలేం.
అది అలా ఉంచితే.. మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలని పెద్దలు చెప్పారు. అలాగే సెలబ్రిటీలన్న తర్వాత కాసింత సామాజిక బాధ్యత కూడా ఉండాలని కూడా చెప్పారు..చెబుతున్నారు. కానీ తారల చెవికి అవి ఎక్కడం లేదు. సినిమాల ద్వారా సంపాదించుంటున్నది చాలదన్నట్టు ప్రకటనల్లోనూ వారే కనిపిస్తున్నారు. పోనీ అక్కడైనా కాస్త బాధ్యతగా ఉంటున్నారా? సిగిరెట్స్ నుంచి మద్యం దాకా ప్రజల ఆరోగ్యాల్ని హరించే ఉత్పత్తుల ప్రచారానికి కూడా సై అంటున్నారు. అది సరికాదని ఎందరు నెత్తి నోరూ బాదుకుంటున్నా కాసుల కక్కుర్తిలో కొట్టుకుపోతున్న సెలబ్రిటీల చెవిన పడడం లేదు.
ఇటీవల టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణ ఓ మద్యం బ్రాండ్ ప్రచారంలో కనిపించడం విమర్శలకు గురైన విషయం తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కాకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. అంటే ఇక ఆమె యువత వోడ్కా తాగడాన్ని శక్తి వంచన లేకుండా ప్రోత్సహించనుందన్న మాట.
‘కృతిని మా జట్టులోకి తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది‘ అని బ్రాండ్ ప్రతినిధులు అంటున్నారు. తాము లక్ష్యంగా చేసుకున్న కొత్త తరం యువ వినియోగదారుల్లా ఆమె తెలివైనది, స్టైలిష్ గా, నిర్భయంగా ఉంటుందని ఇది తమ మ్యాజిక్ మూమెంట్స్‌కు కొత్త అధ్యాయం’’ అంటున్నారు. మరోవైపు ‘మ్యాజిక్ మూమెంట్స్ అంటే అనుభూతిని సొంతం చేసుకోవడం మ్యాజిక్ కుటుంబంలో చేరడం చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది మా భాగస్వామ్యం సరదాగా శక్తితో నిండి ఉంటుంది’’ అంటూ కృతి సనన్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది.
సినీతారలు మద్యం ప్రచారంలో పాల్గొనడం పై విమర్శలు వస్తున్నా కృతి సనన్ సినిమా లాంటి యువ తారలు పట్టించుకోకపోవడం విచారకరం. మరోవైపు పొడుగు కాళ్ల సుందరి కృతిసనన్ మన తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సరసన ఆదిపురుష్‌లో సీతగా కూడా చేసింది. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా... ఆదిపురుష్ చిత్రంలో సీతగా పౌరాణిక పాత్ర చేసిన తర్వాత ఆమె వోడ్కా ప్రచారంలో పాల్గొనడం ఎంత వరకూ సబబు? అనే ప్రశ్న వస్తోంది. మరి ఆమె ప్రచారాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.