షాహిద్‌తో బ్రేకప్‌ కోసం కరీనా కపూర్‌ మీద ఒత్తిడి

Kareena Kapoor, Shahid Kapoor Break Up Love Story - Sakshi

కరీనా కపూర్, షాహిద్‌ కపూర్‌లకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. నటీనటులుగా ఎంత ఫేమసో ప్రేమికులుగానూ అంతే పాపులర్‌.. కిస్మత్‌ కనెక్షన్‌ ఫెయిలయ్యి ఈ ‘మొహబ్బతే’కు నాయికా, నాయకులుగా మారారు...

కరీనా, షాహిద్‌.. ఇద్దరివీ పరస్పర విరుద్ధ మనస్తత్వాలు. ఆమె కొంచెం అహంభావి.. అతను కాస్త ఆకతాయి. ఆమెలోని ఆ అహం  ఆత్మవిశ్వాసంగా అతణ్ణి ఆకర్శించింది. అతనిలోని ఆకతాయి తనం హీరోయిజమ్‌గా ఆమె మనసును దోచుకుంది. అలా ఆ ప్రేమ కథ మొదలైంది. సినిమాల్లో కరీనా.. షాహిద్‌ కన్నా సీనియర్‌. షాహిద్‌ తొలి సినిమా ‘ఇష్క్‌ విష్క్‌’చూసి అతనికి ఫ్యాన్‌ అయింది.

ఎలాగైనా ఆ అబ్బాయిని కలవాలని ఉవ్విళ్లూరింది. కలిసింది. తొలి పరిచయంలోనే ఒకరినొకరు ఆకట్టుకున్నారు. వారం తర్వాత వాళ్ల డేటింగ్‌ మొదలైంది. ‘నువ్వంటే ఇష్టం’ అని తొలుత కరీనానే చెప్పింది షాహిద్‌తో. ‘నాకూ ఇష్టమే’ అని చెప్పాడు. షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పగానే చట్టాపట్టాల్‌తోనే సాయంకాలాలు గడిచిపోయేవి. బాలీవుడ్‌లో ఈ ముచ్చట భలే సందడి చేసింది. అది కరీనా వాళ్లమ్మ బబిత, అక్కయ్య కరిష్మానూ చేరింది. కెరీర్‌ పట్ల కరీనా సీరియస్‌గా లేదని అర్థమైంది వాళ్లకు. ఆమె మెదడులోంచి షాహిద్‌ను తప్పించే ఆలోచనలు చేయసాగారు. 

అతనే హీరో..
తన ప్రేమను స్క్రీన్‌ మీదకూ తెచ్చింది కరీనా... తను చేసే సినిమాల్లో హీరోగా షాహిద్‌ను తీసుకొమ్మని నిర్మాతలను కోరుతూ. ఆమెకున్న డిమాండ్‌ దృష్ట్యా కాదనలేకపోయారు నిర్మాతలు. అలా వాళ్లిద్దరూ కలిసి నటించిన ఫస్ట్‌ మూవీ ‘ఫిదా’ విడుదలైంది. ఫ్లాప్‌ అయింది. అయినా కరీనా పట్టు వీడలేదు. ‘36 చైనా టౌన్‌’, ‘మిలేంగే మిలేంగే’, ‘చుప్‌ చుప్‌ కే’ చిత్రాలూ వచ్చాయి ఈ ఇద్దరి కాంబినేషన్‌లోనే. తెర మీద ఆ జంట ప్రేక్షకులను మెప్పించలేకపోతోందని గ్రహించారు దర్శకనిర్మాతలు. కరీనా తీరు బబిత, కరిష్మాకూ నచ్చలేదు. వ్యక్తిగతాన్ని కెరీర్‌తో ఎందుకు ముడిపెడుతున్నావ్‌? అది అన్‌ప్రొఫెషనల్‌’ అని బబిత కూతురిని హెచ్చరించింది కూడా. షాహిద్‌తో ప్రేమ బంధం తెంచుకొమ్మని అక్క కరిష్మా సలహా ఇచ్చింది చెల్లెలికి.

జబ్‌ వి మెట్‌
నిజ జీవితంలోని వాళ్ల ప్రేమను తెర మీద ఎలా ప్రెజెంట్‌ చేయాలో.. ఆ జంటను ప్రేక్షకులు ప్రేమించేలా ఎలా చూపించాలో దర్శకుడు ఇమ్‌తియాజ్‌ అలీ స్క్రిప్ట్‌ రాసుకున్నాడు. చక్కటి స్క్రీన్‌ ప్లేనూ అల్లుకున్నాడు. ‘జబ్‌ వి మెట్‌’ సినిమా రిలీజ్‌ అయింది. సూపర్‌ హిట్‌ అయింది. తెర మీద ఆ జంటకు క్రేజ్‌ పెరిగింది. దాన్ని క్యాచ్‌ చేసుకుంది మీడియా.. ఆ రియల్‌ లవ్‌ స్టోరీని మళ్లీ ఒకసారి ప్రచురించి.. ప్రసారం చేసి. 

కానీ..
జబ్‌ వి మెట్‌ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే షాహిద్, కరీనాల ప్రేమ బంధం బలహీనపడసాగింది. ఇంట్లో కరీనాకు షాహిద్‌తో తెగతెంపులు చేసుకొమ్మనే పోరు ఎక్కువైంది. అదే సమయంలో షాహిద్‌ .. విద్యాబాలన్‌తో చనువుగా మెదులుతున్నాడనే వార్తలూ కరీనా చెవిన పడ్డాయి. షాహిద్‌ను నిలదీసింది. సమాధానం చెప్పలేదు. ఆమె మనసు ముక్కలైంది. ‘జబ్‌ వి మెట్‌’ సినిమా టైమ్‌లోనే కరీనా తషన్‌ సినిమా కూడా చేస్తోంది. ఆ సెట్స్‌లో సైఫ్‌ అలీఖాన్‌తో తన బాధను పంచుకుంది. షాహిద్‌తో దూరం పెరిగింది. జబ్‌ వి మెట్‌ సెట్స్‌లో ఆ ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. ఆ సినిమా క్రూ కూడా పసిగట్టింది ‘ఏదో జరిగింది’ అని. అయినా ఆ జంట సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగించకుండా చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించి సినిమానూ పూర్తి చేశారని జబ్‌ వి మెట్‌ టెక్నీషియన్స్‌ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో.

విధి భలే విచిత్రమైంది.. కరీనా, షాహిద్‌ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడ్డన్నాళ్లు తెర మీద వాళ్ల జంట ఫెయిల్‌ అయింది. తెర మీద యాక్సెప్టెన్స్‌ వచ్చేప్పటికి నిజ జీవితంలో వాళ్ల మధ్య ప్రేమ లేకుండా పోయింది. ఆ బ్రేకప్‌ వాళ్లిద్దరినీ చాన్నాళ్లపాటు వేధించింది. ఆ బాధను చూసి కాలానికీ జాలేసిందేమో.. ఆ జ్ఞాపకాల్లోంచి ఇద్దరినీ బయటపడేసింది. 

మావి డిఫరెంట్‌ పర్సనాలిలిటీస్‌. ఆ డిఫరెన్సే మా ఇద్దరిలో ఉన్న ఖాళీని పూరించింది. 
– షాహిద్‌

షాహిద్, నేను ఇంచుమించు ఒకే వయసువాళ్లవడం వల్ల త్వరగా కనెక్ట్‌ అయ్యాం. ఆ సేమ్‌ టెంపర్‌మెంటే బ్రేకప్‌కి కారణమై ఉండొచ్చు.
– కరీనా కపూర్‌

- ఎస్సార్‌

చదవండి: పోలీసులను ఆశ్రయించిన సింగర్‌ మధు ప్రియ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top