
Rocky Aur Raniki Prem Kahani: ఏడేళ్ల సుధీర్ఘ కాలం తర్వాత మళ్లీ 'లైట్స్ ఆఫ్, రోలింగ్, యాక్షన్' అని చెప్పబోతున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' సినిమాతో మరోసారి దర్శకత్వం వహిస్తున్నందుకు ఉత్సాహంగా ఉన్నారు. అలియా భట్, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమా విడుదల తేదిని నవంబర్ 29న కరణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నట్లు జూలైలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వీడియో షేర్ చేస్తూ రొమాన్స్ డ్రామా ఫిబ్రవరి 10, 2023న రానున్నట్లు పోస్ట్ చేశారు.
ఆ పోస్టులో '7 సుధీర్ఘ సంవత్సరాల తర్వాత నేను ఇక్కడకు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా తర్వాతి చిత్రం 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' కుటుంబ విలువలతో కూడిన ప్రేమకథ ఫిబ్రవరి 10, 2023న విడుదలవనుంది. థియేటర్లలో పూర్తి వినోదాత్మక చిత్రంతో మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నాం.' అని రాసుకొచ్చారు కరణ్. ఈ చిత్రంలో షబానా అజ‍్మీ, జయ బచ్చన్, ధర్మేంద్ర కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించాయి.