
Kajal Aggarwal First Teej After Marriage Photos: పెళ్లైన తర్వాత మొదటి వివాహ వార్షికోత్సవం వచ్చే లోపు ఆ నూతన దంపతులు జరుపుకునే ప్రతి పండగ వారికి ప్రత్యేకమే.. ఓ మంచి జ్ఞాపకమే. ఇలాంటి బోలెడు జ్ఞాపకాలను పోగుచేసుకునే పనిలో ఉన్నారు కాజల్ అగర్వాల్. గత ఏడాది అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ ఆ వెంటనే సినిమాల షూటింగ్స్‌తో బిజీ అయిపోయారు. ఇప్పుడు కాస్త తీరిక దొరకడంతో ఫ్యామిలీకి టైమ్ కేటాయించారు.
పైగా ఇది శ్రావణమాసం కావడంతో తమ దాంపత్య జీవితం బాగుండాలని ‘హర్యాలీ తీజ్’ (భర్త ఆయురారోగ్యాల కోసం పెళ్లయినవాళ్లు, మంచి భర్త రావాలని పెళ్లి కాని అమ్మాయిలు నార్త్‌లో జరుపుకునే పండగ) ఫెస్టివల్‌ను జరుపుకున్నారు. రోజంతా ఉపవాసం ఉన్నారు కాజల్. పండగ చేసుకున్న ఫొటోలను ‘ఫస్ట్ తీజ్.. హర్యాలీ తీజ్’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు కాజల్. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘ఉమ’, ‘ఘోస్టీ’, ‘కరుంగాప్పియమ్’, ‘హే సినామిక’ షూటింగ్‌లను పూర్తి చేసిన ఆమె చిరంజీవితో ‘ఆచార్య’, నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు.