డ్రగ్స్‌ కేసులో బంగ్లా స్టార్‌ హీరోయిన్‌ అరెస్ట్‌, అత్యాచార కేసుకు బదులుగానేనా?

Justice For Pori Moni Bangladesh Top Heroine Arrested In Revenge Case - Sakshi

రంగుల ప్రపంచంలో వివాదాలు-విమర్శల్లో చిక్కుకునే సెలబ్రిటీల పరిస్థితి ఎలా ఉంటోందో చెప్పే ఘటన ఇది. అగ్ర కథానాయిక పోరీ మోనీ(28) అరెస్ట్‌ బంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున్న మాదక ద్రవ్యాలు కలిగి ఉందన్న ఆరోపణలపై బంగ్లాదేశ్‌ యాంటీ-టెర్రర్‌ స్క్వాడ్‌ ‘రాబ్‌’(Rapid Action Battalion) బుధవారం రాత్రి ఆమెను అరెస్ట్‌ చేసింది. అయితే ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై లైంగిక-హత్యారోపణలు చేసిన కొద్దిరోజులకే ఆమె అరెస్ట్‌ కావడంతో..  ఆమె ఫ్యాన్స్‌ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాను న్యాయం కోసం నిలదీస్తున్నారు. 
 

అరెస్ట్‌ ఇలా.. బుధవారం సాయంత్రం ఢాకా బనానీలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్న రాబ్‌ టీం.. సుమారు నాలుగు గంటపాటు సోదాలు నిర్వహించింది. ఆపై రాత్రి తొమ్మిది గంటల టైంలో ఆమెను హెడ్‌ క్వార్టర్స్‌కు తరలించి ప్రశ్నించింది. ఆ వెంటనే ఆమె అరెస్ట్‌ను ధృవీకరిస్తూ రాబ్‌ వింగ్‌ డైరెక్టర్‌ కమాండర్‌  ఖాందకేర్‌ మోయిన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున్న మత్తు, మాదక  ద్రవ్యాలు, ఫారిన్‌ లిక్కర్‌ బాటిళ్లు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు రాబ్‌ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. నాలుగు రోజుల రిమాండ్‌ విధించింది న్యాయస్థానం.

ప్రతీకారంగానే..
పోరీ మోనీ అసలు పేరు షామ్‌సున్నాహర్‌. సైడ్‌ కిక్‌ వేషాల నుంచి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. జూన్‌ 8న ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు నజీర్‌ ఉద్దీన్‌ మహమ్మూద్‌ మీద లైంగిక ఆరోపణలు చేసింది. బోట్‌ క్లబ్‌ వద్ద నజీర్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఒక స్టార్‌ హీరోయిన్‌ లైంగిక ఆరోపణలు చేయడం సినీ పరిశ్రమను కుదిపేయగా.. హైలెవల్‌ పరిచయాలతో కేసు నమోదు కాకుండా తప్పించుకున్నాడు నిందితుడు. ఈ తరుణంలో ఆమెకు నటులు, నెటిజన్స్‌ నుంచి మద్ధతు దక్కింది. తనకు న్యాయం చేయాలంటూ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు ఆమె ఫేస్‌బుక్‌ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీంతో ఎట్టకేలకు నిందితుడు నజీర్‌ను, ముగ్గురు మహిళల్ని, నజీర్‌ సహచరుడైన డ్రగ్‌ డీలర్‌ తుహిన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
 

ఉల్టా కేసు
నజీర్‌ అరెస్ట్‌ అయిన వారం తర్వాత గుల్షన్‌ ఆల్‌ కమ్యూనిటీ క్లబ్‌ వాళ్లు పోరీ మోనీపై ఉల్టా ఓ కేసు దాఖలు చేశారు(నజీర్‌ ఈ క్లబ్‌కు డైరెక్టర్‌ కూడా). డ్రగ్స్‌ మత్తులో జూన్‌ 7న ఆమె క్లబ్‌పై దాడి చేసిందని క్లబ్‌ అధ్యక్షుడు అలంగిరి ఇక్బాల్‌  ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ వివరించాడు. ఈ నేపథ్యంలో ఆమెపై నార్కొటిక్‌ చట్టం ప్రకారం కేసు నమోదుకాగా.. ఆపై బెయిల్‌ దొరికింది. ఆ వెంటనే నజీర్‌, అతని అనుచరులు బెయిల్‌ మీద జైలు నుంచి విడుదలయ్యారు. 

చంపేస్తారన్న కాసేపటికే.. 
బుధవారం మధ్యాహ్నాం పోరి మోనీ ఫేస్‌బుక్‌ లైవ్‌లోకి వచ్చింది. తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని, గేట్‌ను ధ్వంసం చేశారని, సాయం కోరినా పోలీసులు స్పందించడం లేదంటూ ఆమె లైవ్‌లో వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వంకతో వచ్చి కూడా తనను చంపేస్తారని భయంగా ఉందంటూ ఆమె ఆందోళన చెందింది. ఆ కాసేపటికే ఇంటికి చేరుకున్న Rapid Action Battalion.. ఆమెను అరెస్ట్‌ చేయడం కొసమెరుపు. ఇక పోరీ మోనీతో పాటు ఓ సినిమా ప్రొడ్యూసర్‌-అతని ఇద్దరు అనుచరుల మీద కూడా నార్కొటిక్‌ కేసు నమోదు అయ్యింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top