జయలలిత బయోపిక్స్‌: దీపకు చుక్కెదురు‌

Jayalalitha Biopic: Line Clear For Thalaivi Movie - Sakshi

అమ్మ చిత్రాలకు పచ్చజెండా

సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపకు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. జయలలిత జీవిత ఇతివృత్తాంత చిత్రాలు, వెబ్‌ సీరియల్‌కు వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసి పుచ్చింది. దివంగత సీఎం జయలలితకు వారసులు తామే అని ఆమె మేన కోడలు దీప, మేనళ్లుడు దీపక్‌ సాగిస్తున్న న్యాయపోరాటం గురించి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జయలలిత జీవిత ఇతివృత్తాంతతో క్వీన్‌ పేరిట వెబ్‌ సిరీస్, తలైవి, జయ పేరిట చిత్రాలు తెరకెక్కించే పనిలో ప్రముఖ దర్శకులు నిమగ్నమయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ దీప కోర్టును ఆశ్రయించారు.

తన మేనత్త జీవిత ఇతివృత్తాంతంతో తెరకెక్కుతున్న వెబ్‌ సీరిస్, చిత్రాల్లో తమ కుటుంబానికి వ్యతిరేకంగా అంశాలు ఉన్నట్టు, ఈ చిత్రాలు, వెబ్‌ సీరియల్స్‌పై స్టే విధించాలని కోరారు. తొలుత ఈ  పిటిషన్‌ను సింగిల్‌ బెంచ్‌ విచారించింది. అయితే, ఈ పిటిషన్‌ను సింగిల్‌ బెంచ్‌ తోసి పుచ్చడంతో అప్పీలుకు దీప వెళ్లారు. హైకోర్టు బెంచ్‌ ముందు శుక్రవారం పిటిషన్‌ విచారణకు వచ్చింది.

తలైవి అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఇందులో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి అంశాలు లేవని, ఆమె అనుమతి పొందాల్సిన అవసరం లేదని చిత్ర దర్శకుల తరఫున వాదనలు కోర్టుకు చేరాయి. వాదనల అనంతరం దీపకు మళ్లీ చుక్కెదురైంది. ఆమె వాదనను కోర్టు తోసి పుచ్చింది. సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను ధ్రువీకరిస్తూ, ఆ చిత్రాలకు లైన్‌ క్లియర్‌ చేస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు ఇచ్చారు.

చదవండి: 
16 గంటలు వర్షంలో కంగనా.. జ్వరంతోనే వాన పాట!

‘రాధేశ్యామ్‌’లో పూజా హేగ్డే పాత్ర ఇలా ఉంటుందట

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top