
‘కమల్ హాసన్ కుమార్తె’ అనే ఓ ప్రత్యేకమైన ట్యాగ్‌తోనే అందరికీ పరిచయం అయినా, శ్రుతి హాసన్ ఇప్పుడు ఆ పేరుకు మించి తనదైన గుర్తింపును ఏర్పరచుకుంది. త్వరలో రానున్న ‘కూలీ’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది.
→ చిన్ననాటి నుంచి మురుగన్ స్వామిని విశ్వసించే శ్రుతి, ఇటీవల వారాహీమాత భక్తురాలిగా మారింది. చెన్నైలోని ఓ చిన్న గుడికి వెళ్లిన తర్వాత తనలో భయాలు తగ్గాయని, జీవితంలో మానసిక ప్రశాంతతను పొందానని చెప్పింది. వారాహిమాతను పూజించడం ప్రారంభించిన తరువాత తన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పింది.
→ తనకు వచ్చిన తన తండ్రి కమల్ హాసన్ వాయిస్ కారణంగా కెరీర్ ప్రారంభంలో ఆమె చేసిన డబ్బింగ్, పాటలపై ట్రోల్స్ ఎక్కువైనా, నమ్మకాన్ని కోల్పోలేదట! ఏ ఆర్ రెహమాన్ సంగీతంపై చిరకాల కోరిక. ‘థగ్ లైఫ్’లో ఆయన సంగీత దర్శకత్వంలో పాట పాడుతున్నప్పుడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యిందట!
→ జాతకాలను గట్టిగా నమ్ముతుంది. ప్రస్తుతం కుజ మహాదశలో ఉందని చెప్పింది. స్నేహితురాలు సుకన్య జ్యోతిష్య శాస్త్రం మీద రాసిన పుస్తకం ద్వారా, ఆమె సలహాలు తీసుకుంటుందట!
→ తండ్రి కమల్ హాసన్‌లో తనకు నచ్చిన క్వాలిటీ– ఆయన విల్ పవర్. తండ్రి అభిమాన దర్శకుడు అకిరా కురసోవా సినిమాలు చూసి, ఆయన జీవిత చరిత్ర చదివాక జపాన్ మీద ప్రత్యేకమైన అభిమానం పెంచుకుంది.
→ తన జీవితంలో రెండు షేడ్స్ ఉన్నాయంటోంది శ్రుతి– ఒకటి ప్రజల కోసం, మరొకటి స్నేహితుల కోసం. మూడున్నరేళ్ల వయసులో పరిచయమైన ఫ్రెండ్‌తో ఇప్పటికీ స్నేహం కొనసాగుతుందట!
→ బాల్యంలో తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక– ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉండేవారు. కమల్ హాసన్ ఏడెనిమిది గంటల పాటు స్క్రీన్ ప్లే రాసుకుంటుంటే, సారిక సినిమా సౌండ్ డిజైనింగ్ లో బిజీగా ఉండేది.
→ తల్లిదండ్రులిద్దరూ స్కూల్‌కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు కాదు. కాని, పిల్లల చదువు విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ఇంట్లో పూర్తిగా నాస్తిక వాతావరణం ఉండేది. ఇంట్లో పూజలు చేసేవారు కాదు. అయినా తన భక్తి దారి వేరే అని చెబుతుంది
→ వంట అంటే మక్కువ, సౌత్ ఇండియన్ , ఇటాలియన్ వంటకాల్లో ప్రావీణ్యం. సాంబార్ రైస్, మటన్ సూప్, మోచీ ఐస్‌క్రీమ్– ఆమె ఫేవరెట్‌డిషెస్.