ఈరోజు మా నాన్న ఉండుంటే.. ఆ థియేటర్‌తో 'మారుతి' అనుబంధం | Film Director Maruthi Remind His Flash Back Story With Machilipatnam | Sakshi
Sakshi News home page

ఈరోజు మా నాన్న ఉండుంటే.. ఆ థియేటర్‌తో 'మారుతి' అనుబంధం

Jun 16 2025 11:41 AM | Updated on Jun 16 2025 11:58 AM

Film Director Maruthi Remind His Flash Back Story With Machilipatnam

ప్రభాస్‌ హీరోగా  మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్‌' (The RajaSaab). సోమవారం టీజర్‌ విడుదల కానుంది. ఈ క్రమంలో పలు థియేటర్స్‌ వద్ద ప్రభాస్‌, మారుతి కటౌట్స్‌ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేశారు. వాటిని చూసిన దర్శకుడు ఎమోషనల్‌ అయ్యారు. గతంలో తన తండ్రి అరటిపళ్లు అమ్మినచోట ఇప్పడు తన కటౌన్‌ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ మారుతి తెలిపారు. ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేసిన మారుతి.. టాలీవుడ్‌లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. మచిలీపట్నం, వైజాగ్‌లో మారుతి పెరిగారు.  ఆ ప్రాంతాలతో ఆయనకు మంచి అనుబంధం  ఉన్న విషయం తెలిసిందే.

'మచిలీపట్నం - సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్)తో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ  మా నాన్నగారికి ఒకప్పుడు చిన్న అరటిపళ్లు దుకాణం ఉండేది. ఎప్పటికైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఈ థియేటర్‌లో విడుదలైన అందరి హీరోల సినిమాల బ్యానర్స్‌ నేను ఎంతో ఆశతో కట్టేవాడిని. ఒక్కసారైనా నా పేరు ఇక్కడ చూడాలని కలలు కనేవాడిని. ఇప్పుడు ఇదే థియేటర్‌ వద్ద నిలబడి చూస్తుంటే.. నా ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో అన్ని గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు జీవితం పరిపూర్ణమైందనిపిస్తుంది. 

పాన్‌ ఇండియా స్టార్‌ పక్కన నా కటౌట్‌ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎవరికైనా ఇంతకు మించి ఇంకేం కావాలి. కానీ, ఈరోజు మా నాన్న ఉండుంటే చాలా గర్వపడేవారు. ఆయన్ని  మిస్‌ అవుతున్నాననే బాధ ఉంది. ఏదైనా ఉన్న సమయంలోనే మన బాధ్యతలను పూర్తి చేయాలి.  మన డార్లింగ్‌ను వెండితెరపై నేను ఎలా చూపించాలని ఆశ పడ్డానో మీ అందరికీ చూపించనున్నాను. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది.' అని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement