List of Actress Died due to Failure of Cosmetic Surgery - Sakshi
Sakshi News home page

కాస్మొటిక్‌ సర్జరీ వెంటపడుతున్న తారలు.. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా డోంట్‌ కేర్‌!

Published Thu, May 19 2022 12:27 AM

Failures fat removal surgery in film industry - Sakshi

‘అందం’ అనే భావన గతంలో ఒకలా ఉండేది. ఇప్పుడు మరోలా ఉంది. ఏవో కొన్ని కొలతల్లో ఇమిడితేనే అందం అంటున్నారు. ఆ కొలతల కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. గతంలో తెలుగు నటి ఆర్తి అగర్వాల్‌ అమెరికాలో ఈ కారణం చేతనే మరణించింది. ఇప్పుడు మరో కన్నడ నటి. ఈ భావజాలానికి విరుగుడు కనిపెట్టాలి.

దక్షిణాదిలో మొదటగా కాస్మెటిక్‌ సర్జరీని శ్రీదేవి పరిచయం చేసింది. ఆమె తన ముక్కును ‘సరి చేసుకోవడం’ ద్వారా సగటు గృహిణులకు కూడా అటువంటి సర్జరీలు ఉంటాయని తెలియచేసింది. అంతవరకూ దక్షణాదిలో ‘బొద్దు’గా ఉండటం లేదా సహజ రూపంలో సౌందర్యాత్మకంగా ఉండటం సినీ పరిశ్రమలో సమ్మతంగా ఉండేది. ప్రేక్షకులు అటువంటి హీరోయిన్లు ఆదరించారు.

అంజలీదేవి, సావిత్రి, కె.ఆర్‌.విజయ, బి.సరోజా దేవి, రాజశ్రీ, జయలలిత, దేవిక... వీరందరూ పూల తీవల్లాగా సుకుమారంగా తెర మీద కనిపించేవారు కాదు. ఆరోగ్యంగా, నిండుగా ఉండేవారు. దక్షిణాది స్త్రీలు తమను వారిలో పోల్చుకునేవారు. అయితే శ్రీదేవి ఉత్తరాదికి వెళ్లి నటించాలనుకున్నప్పటి నుంచి, ఉత్తరాదిలో కొత్తతరం వచ్చి ‘కాస్ట్యూమ్స్‌’ అధునాతనంగా మారి, ఫ్యాషన్‌ డిజైనర్స్‌ వచ్చి కొలతలను నిర్థారించడం మొదలెట్టినప్పటి నుంచి ఈ కాస్మెటిక్‌ సర్జరీల ధోరణి పెరిగింది. నేటికి అది శ్రుతి మించి ప్రాణాలకు ప్రమాదం తెచ్చే స్థాయికి చేరింది.

లబ్ధి పొందినవారు ఉన్నారు
కాస్మెటిక్‌ సర్జరీల వల్ల లబ్ధి పొందిన వారు ఉన్నారు. తమను తాము కొత్తగా మార్చుకున్నవారు ఉన్నారు. దానివల్ల కెరీర్‌లో ఎక్కువ రోజులు ఉండగలిగారు. అయితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే ఇలాంటి సర్జరీలను ఎంతవరకు ఉపయోగించాలో తెలుసుకున్నవారు సఫలం అయ్యారు. మీనాక్షి శేషాద్రి ముక్కును సరి చేసుకుని కొత్త రూపు పొందింది. హేమమాలిని ‘బ్లెఫరోప్లాస్టీ’ (కంటి ముడుతలు, సంచులు తొలగించే సర్జరీ), బొటాక్స్‌ల ద్వారా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసుకోగలిగిందనే వార్తలు ఉన్నాయి.

ఇక అమితాబ్‌ తన తల వెంట్రుకలను, దవడలను ‘కరెక్ట్‌’ చేసుకుని ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’తో కొత్తరూపులో వచ్చాడు. గతంలో రజనీకాంత్‌కు పెదాల మీద మచ్చలు ఉండేవి. ఆయన కాస్మెటిక్‌ సర్జరీ ద్వారానే వాటిని పోగొట్టుకున్నాడు. ప్రియాంక చోప్రా నుంచి అనుష్కా శర్మ వరకు ఎందరో ఈ సర్జరీల దారిలో నేటికీ ఉన్నారు. తెలుగులో సమంత మునుపటి రూపానికి ఇప్పటి రూపానికి తేడా చూస్తే ఆమెలో కాస్మటిక్‌ మార్పులను గమనించవచ్చు. షారూక్‌ ఖాన్‌ భార్య గౌరి ఖాన్‌ కూడా తన రూపం కోసం ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకుంది.

వికటించిన వైనాలు
కాని ప్రకృతి సిద్ధంగా వచ్చిన రూపాన్ని ఒకసారి కత్తిగాటు కిందకు తీసుకువచ్చాక అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఇంకా మారుద్దాం ఇంకా మారుద్దాం అని అనిపించే మానసిక స్థితి వచ్చి శరీరానికి పెనువిపత్తు, రూపానికి విఘాతం కలిగే అవకాశం ఉంది. మైకేల్‌ జాక్సన్‌ తన రూపాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీదేవి లెక్కకు మించిన సర్జరీలతో ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సమయానికి ఎంతో బలహీనంగా తెర మీద కనిపించడం అభిమానులు చూశారు. రాఖీ సావంత్‌ వంటి వారు ఈ సర్జరీలతో గత రూపం ఏమిటో తెలియనంతగా మారిపోయారు. జూహీ చావ్లా చేయించుకున్న ప్లాస్టిక్‌ సర్జరీ ఆమె సహజ రూపాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. కత్రీనా కైఫ్, వాణి కపూర్‌లకు ఈ సర్జరీలు అంతగా లాభించలేదు. ఆయేషా టకియాకు ఈ సర్జరీలు బాగా నష్టం చేశాయి.

ఊహించని మరణాలు
తెర మీద సన్నగా కనిపించడానికి లైపోసక్షన్‌ చేయించుకున్న పంజాబీ నటుడు వివేక్‌ షౌక్‌ 2011లో మరణించాడు. ఇండస్ట్రీలో మరోసారి అదృష్టం పరీక్షించుకోవడానికి అమెరికాలో ఇలాంటి సర్జరీలోనే 2015లో ఆర్తి అగర్వాల్‌ మరణించింది. తాజా 21 ఏళ్ల కన్నడ నటి చేతనా రాజ్‌ ఫాట్‌లాస్‌ సర్జరీతోనే ప్రాణం కోల్పోయింది. అనుభవం ఉన్న డాక్టర్లు చేయకపోవడం వల్ల కొంత, శరీరాలకు తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. అలాంటి వీటి వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి ప్రచారం లేదు.

నా రూపమే నా సౌందర్యం
తెర మీద నటించాలంటే మొదట నటన కావాలి... తర్వాత రూపం అవసరమవుతుంది అనే భావన చాలా ఏళ్లకు గాని రాలేదు. సీమా బిస్వాస్‌ వంటి నటీమణులు, నవాజుద్దీన్‌ సిద్ధఖీ వంటి నటులు నటనను ముందుకు తెచ్చి రూపాన్ని వెనక్కు తీసుకెళ్లారు. ముఖాన మొటిమలు ఉన్నా సాయి పల్లవి తన నటనతో కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు వాణిశ్రీ– హీరోయిన్లు బంగారు వర్ణంలో ఉండాలన్న రూలును బద్దలు కొట్టింది. సుజాత, జయసుధ లాంటి వాళ్లు మోడ్రన్‌ దుస్తులు, విగ్గులు లేకపోయినా సుదీర్ఘ కెరీర్‌ సాధించవచ్చు అని నిరూపించారు.

ఒకవైపు ఈ కాలపు అమ్మాయిలు బాడీ షేమింగ్‌లతో, ఫ్యాషన్‌ ఇండస్ట్రీ తెచ్చే కొత్త కొత్త కొలతలతో, కాస్మటిక్‌ ఇండస్ట్రీ విసిరే కొత్త కొత్త వలలతో సతమతమవుతుంటే తెర మీద కనిపించే నటీమణులు తమ రూపాలు మార్చుకుంటూ ‘ఇలా ఉండటమే కరెక్టేమో’ అనే సందేశాలు ఇవ్వడం మెల్లగా తగ్గాలి. సహజ రూపమే సౌందర్యాత్మకమైనది అనే భావనకు ప్రచారం రావాలి. అత్యంత అవసరమైన, సురక్షితమైన చిన్న చిన్న అవసరాలకు తప్ప ఈ కృత్రిమ రూపాలకు దూరంగా ఉండాలనే చైతన్యం కలగాలి. అప్పుడే ప్రతిభ ముందుకు వచ్చి రూపానికి రెండవ స్థానం లభించగలదు. అందుకు అందరూ ప్రయత్నించాలి.

సహజమే... సౌందర్యం...
నిజానికి బ్యూటీ కాంటెస్ట్‌లలో కూడా ‘ఇలా కనపడాలి... అలా కనపడాలి’ అంటూ ఏమీ నిబంధనలు ఉండవు. అయినా అమ్మాయిలు ఓవర్‌ కాన్షియస్‌ అయిపోయి ఏవేవో లోపాలు వెతుక్కుంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వర్కవుట్స్‌ తోనే గ్లో తెచ్చుకుని అందంగా కనిపించవచ్చు. ఏదైనా సరే సహజమైన పద్ధతులే తప్ప లేజర్‌ సర్జరీలు, ప్లాస్టిక్‌ సర్జరీలు వంటివి తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం అయితే ఓకే కానీ అందం కోసం చేయించుకోవడం సరైంది కాదు.
– అభిమానిక తవి, ఫిట్‌నెస్‌ ట్రైనర్, బ్యూటీ పేజెంట్‌ గ్రూమింగ్‌

పోల్చుకోవడమే పెద్ద సమస్య...
అందంగా కనిపించాలని ముందు మేకప్‌ చేసుకోవడం నుంచి మొదలుపెడతారు. తర్వాత బ్యూటీషియన్స్‌ని సంప్రదిస్తుంటారు. కాస్మెటిక్స్‌ ను విపరీతంగా వాడతారు. తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీకి వెళతారు. ఇది బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్‌. వీరిలో సోషల్‌ యాంగ్జైటీ ఎక్కువ. నలుగురిలో తామే అందంగా కనిపించాలి. లేదంటే కామెంట్‌ చేస్తారేమో అని భయపడుతుంటారు కూడా. వేరే ఆలోచన ఉండదు. రోజులో ఎక్కువ మొత్తం ‘అందం’పైనే శ్రద్ధ పెడతారు. ఉన్నదున్నట్టుగా అంగీకరించడం వంటివి నేర్చుకునేలా కుటుంబంలోని వారంతా శ్రద్ధ చూపాలి. అందం ఉండటం కంటే ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి అనే విషయంలో గైడెన్స్‌ ఇవ్వాలి. లేదంటే అందం కోసం సర్జరీల వరకు వెళ్లడం అనే ఆలోచన ఒక వైరస్‌లా అంటుకుపోతుంది. సూసైడల్‌ టెండెన్సీ, ఇంటి నుంచి వెళ్లిపోవడం, ఇతరుల మాటలకు ప్రభావితులు అవడం వంటివి జరుగుతాయి.
– గీతా చల్ల, సైకాలజిస్ట్‌

చదవండి: సీరియల్‌ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement