టైటిల్: క్రేజీ కల్యాణం
నటీనటులు:డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు
నిర్మాణ సంస్థ: యారో సినిమాస్
నిర్మాత: బూసం జగన్ మోహన్ రెడ్డి
దర్శకత్వం: బద్రప్ప గాజుల
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దూపాటి
ఎడిటర్: శ్రావణ్ కటికనేని
విడుదల తేది: అక్టోబర్ 16, 2026
కథేంటంటే..
మెదక్ జిల్లాకు చెందిన పర్వతాలు(నరేష్)కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుంటాడు. అల్లుడు బాలరాజు(తరుణ్ భాస్కర్) పెద్ద తాగుబోతు. నిత్యం తాగుతూ..ఊర్లో వాళ్ళతో గొడవలు చేసి మామ పరువు తీస్తుంటాడు. దీంతో తన చిన్న కూతురు కీర్తి కు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పోయిన తన పరువుని కాపాడుకోవాలనుకుంటాడు.
కానీ కీర్తి కాలేజీ లో ఉదయ్(అఖిల్ రాజ్)ని ప్రేమిస్తుంది. బాగా చదువుకొని జాబ్ వచ్చిన తరువాత ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ లోపు నాన్న పర్వతాలు ఒక అమెరికా సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. నాన్న కోరిక మేరకు కీర్తి ఆ అమెరికా సంబంధం ఓకే చేసిందా? లేదా ప్రేమించిన ఉదయ్‌ని పెళ్లి చేసుకుందా? బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలకున్న తన లక్ష్యం నెరవేరిందా? లేదా? కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత పర్వతాలు ఏం చేశాడు? చివరకు కీర్తి పెళ్లి ఎవరితో జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచే ఆంక్షలు మొదలవుతాయి. చదువు పూర్తవగానే పెళ్లి చేసి తమ బాధ్యత తీరిపోయిందని భావించే తల్లిదండ్రులు ఎంతోమంది. పైచదువుల కోసం లక్ష రూపాయలు ఖర్చు చేయడానికి వెనకడుగు వేసేవారే.. పెళ్లి విషయానికొచ్చేసరికి లక్షల రూపాయలు కట్నంగా ఇవ్వడానికి వెనకాడరు.
అదే డబ్బులో పదో వంతు అమ్మాయి చదువుపై ఖర్చు చేస్తే.. ఆమె జీవితమే కాదు, కుటుంబ భవిష్యత్తు కూడా మారిపోతుంది. ఆడపిల్ల అంటే బాధ్యత మాత్రమే కాదు.. తల్లిదండ్రుల గర్వాన్ని నిలబెట్టగల సత్తా ఉన్న వ్యక్తి అని చాటిచెప్పే చిత్రమే ఈ క్రేజీ కళ్యాణం. దర్శకుడు బద్రప్ప ఎంచుకున్న పాయింట్ పాతదే కానీ..కానీ తెలంగాణ నేపథ్యంలో ఈ కథను నడిపించడం కొంతవరకు కొత్తదనం తెచ్చిపెట్టింది. సందేశం బాగున్నా..దాన్ని ఆకట్టుకునేలా చెప్పడంలో మాత్రం దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు.
తాగుబోతు అల్లుడుతో మామ పడే ఇబ్బందుల సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. మొదటి పది నిమిషాలు పాత్రల పరిచయానికే పోతుంది. ఆ తర్వాత నరేశ్, తరుణ్ భాస్కర్ల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చిన్న కూతురు పెళ్లి కోసం పర్వతాలు పడే ఆరాటం కామెడీగా చూపిస్తూనే.. మరోవైపు కీర్తి, ఉదయ్‌ల లవ్ట్రాక్ని నడిపించాడు. అయితే ఈ లవ్‌ట్రాక్ రొటీన్‌గానే ఉండడంతో కొంతవరకు బోరింగ్‌గా అనిపిస్తుంది.
తరుణ్ భాస్కర్ చేసే కామెడీ ఆ మైనస్‌ని పూడ్చుకొచ్చింది. ఓ ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక ద్వితియార్థం కొంతవరకు సీరియస్‌గా సాగుతుంది. ఎమోషనల్ సీన్లు బాగానే ఉంటాయి. అయితే కామెడీ సీన్లు వర్కౌట్ అయినట్లుగా అవి కాలేదు. చివరి అరగంట సినిమా పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది.
అక్కడ నరేశ్ నటన అదిరిపోతుంది. మధ్యలో తరుణ్ భాస్కర్ చేసే యాక్షన్ సీన్ కొంతవరకు నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. రొటీన్ కథే అయినా సందేశం బాగుంటుంది. రెండు భారీ సినిమాల(జైలర్ 2, రణబాలి) మధ్య రిలీజ్ అవ్వడం ఈ సినిమాకు కొంత మైనస్. సోలోగా వచ్చి ఉంటే..ఫలితం మరింత మెరుగ్గా ఉండేదేమో!
ఎవరెలా చేశారంటే..
మధ్యతరగతి కుటుంబానికి చెందిన తెలంగాణ గ్రామీణ యువతి కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ చక్కగా నటించింది. తెలంగాణ యాసతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంది. తెరపై పక్కింటి అమ్మాయిలా అందంగా కనిపించింది. ఇక నరేశ్ అయితే మిడిల్ క్లాస్ నాన్న పర్వతాలు పాత్రలో జీవించేశాడు. అయితే తెలంగాణ యాసలో మాట్లాడడం కొంతవరకు కృతంగా అనిపించింది.
బాలరాజు పాత్రలో తరుణ్ భాస్కర్ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. కీర్తి బాయ్‌ఫ్రెండ్ ఉదయ్ పాత్రకు అఖిల్ రాజ్ న్యాయం చేశాడు. కీర్తి అక్క పాత్రతో పాటు మిగిలిన వారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సురేష్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


