‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా... నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా’.. ఈ పాట మహేశ్‌బాబు హీరోగా చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మురారి’ లోనిదని ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇప్పుడు ఈ పాటను సరదాగా కొందరు తెలుగు హీరోలు పాడుకుంటున్నారట... ఎందుకంటే ఈ హీరోలు కమిట్ అయిన తాజా చిత్రాల్లో ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. అయితే ఫలానా హీరో సరసన ఫలానా హీరోయిన్ నటించనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి... ఈ కొత్త ఊహా తారల కహానీ ఏంటో మీరూ ఓ లుక్ వేయండి.
గ్యాంగ్‌స్టర్ డ్రామాలో...
చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) తెరకెక్కించనున్న గ్యాంగ్‌స్టర్ డ్రామాలో చిరంజీవి హీరోగా నటిస్తారు. కేవీన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్‌హిట్ తర్వాత చిరంజీవి, బాబీల కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వర్క్స్‌లో భాగంగానే దర్శకుడు బాబీ ఈ చిత్రంలోని ఇతర నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారని తెలిసింది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఈ హీరోయిన్స్ రోల్స్‌కు మాళవికా మోహనన్, రాశీ ఖన్నాలను సంప్రదించారట బాబీ. అలాగే ఈ మూవీలో ఓ పవర్‌ఫుల్ రోల్ కూడా ఉందని, ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ మోహన్‌లాల్ వంటి యాక్టర్స్‌తో చర్చలు జరుపుతోందనే టాక్ తెరపైకి వచ్చింది. మరి... చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్, రాశీ ఖన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్.
జోడీ రిపీట్
నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). నాగార్జున కెరీర్‌లో ఇది వందో సినిమా. తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఇప్పటికే అనుష్కా శెట్టి, టబు భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమా కోసం నాగార్జున, అనుష్క తొలిసారి కలిసి నటించారు.
ఆ తర్వాత ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’ చిత్రాల్లో నటించారు. అలాగే ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నాగార్జున, అనుష్కా శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇంకా నాగార్జున ‘కింగ్, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాల్లో అనుష్క అతిథిగా నటించారు. మరి... ‘కింగ్ 100’లో కూడా అనుష్కా శెట్టి భాగం అవుతారా? అయితే హీరోయిన్‌గా నటిస్తారా? లేక ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తారా? అనే అంశాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ‘నిన్నే పెళ్లాడతా.., ఆవిడా మా ఆవిడే!’ వంటి సినిమాల్లో నాగార్జున – టబు హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ‘కింగ్ 100’ సినిమాలో టబు కూడా కనిపిస్తారా? ఈ జోడీలు రిపీట్ అవుతాయా? వేచి చూడాలి. ఇక ‘కింగ్ 100’ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
కబురు వెళ్లిందా?
‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రామ్‌చరణ్(Ram Charan), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నర పైనే అవుతున్నా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతనే సుకుమార్‌తో చేయాల్సిన మూవీని సెట్స్‌కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట రామ్‌చరణ్. ఈలోపు ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన పనులపై దర్శకుడు సుకుమార్ మరింత ఫోకస్ పెట్టారట.
అలాగే ఇందులోని నటీనటుల ఎంపిక గురించి కూడా సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఆల్రెడీ సమంత, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో మహేశ్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో కృతీ సనన్ హీరోయిన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి... రామ్‌చరణ్‌తో సుకుమార్ చేయబోయే సినిమా గురించిన కబురు కృతీ సనన్‌కు వెళ్లిందా? ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
అంతర్జాతీయ స్థాయిలో...
అల్లు అర్జున్( Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఆల్రెడీ దీపికా పదుకోన్ ఈ చిత్రంలో భాగమయ్యారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తారనే ప్రచారం టాలీవుడ్‌లో తెరపైకి వచ్చింది. అయితే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. ఇక మిగతా హీరోయిన్స్ ఎంపికలపై కూడా త్వరలోనే ఓ ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతర్జాతీయ స్థాయిలో 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ఈ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారని టాక్.
జూలియట్ ఎవరో!
‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నారు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే నాని హీరోగా సుజిత్ డైరెక్షన్‌లోని సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సుజిత్‌తో చేసే చిత్రం షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట నాని. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, ఇదో గ్యాంగ్‌స్టర్ సినిమా అనే ప్రచారం జరుగుతోంది.
అలాగే ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు వినిపించింది. నాని – ప్రియాంక ‘నానీస్ గ్యాంగ్‌లీడర్, సరిపోదా శనివారం’ చిత్రాల్లో జోడీగా నటించారు. కానీ ‘బ్లడీ రోమియో’ సినిమాలోని హీరోయిన్‌గా పూజా హెగ్డే కనిపిస్తారనే ప్రచారం లేటెస్ట్‌గా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఫైనల్‌గా ఈ ‘బ్లడీ రోమియో’ సరసన జూలియట్‌గా ఎవరు కనిపిస్తారనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. 2026 చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ముచ్చటగా మూడోసారి...
‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోనే విజయ్–రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి... విజయ్–రష్మిక మందన్నాల జోడీ మళ్లీ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
దేవి సరసన....
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ అనే ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తారంటూ నాని, నితిన్, శర్వానంద్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఈ చాన్స్ దేవిశ్రీ ప్రసాద్‌కు లభించిందని, కథ నచ్చడంతో దేవిశ్రీ కూడా ‘ఎల్లమ్మ’ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో దేవి సరసన హీరోయిన్‌గా కీర్తీ సురేష్ దాదాపు ఖరారు అయ్యారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
డబుల్ ఎంట్రీ
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్‌బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేయనున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ సినిమాలో రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ హీరోయిన్‌గా నటిస్తారని, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ కూడా జరిగిందట. ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ సినిమాను వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక జయకృష్ణకు యాక్టర్‌గా ఇది తొలి చిత్రం అయితే, రాషాకు తెలుగులో ఇది తొలి మూవీ అవుతుంది. అయితే ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇలా హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కావాల్సిన మరికొన్ని సినిమాలు ఉన్నాయి.


