కమెడియన్ రామచంద్ర.. ఒకప్పుడు ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు, నవ్వుల జల్లు కురిసేది. అమాయకంగా డైలాగులు చెబుతూ, తనదైన శైలిలో కామెడీ పండిస్తే.. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేవారు. స్టార్ హీరోల సినిమాల్లోనూ తన మార్క్ కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ కమెడియన్.. ఇప్పుడు మాత్రం దీనస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు నవ్వులు పంచిన ఆయన జీవితంలో ఇప్పుడు కన్నీళ్లు నిండిపోయాయి. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. సహాయం కోసం వేడుకుంటున్నాడు.
‘ఆనందం’, ‘సొంతం’, ‘వెంకీ’, ‘కింగ్’, ‘దుబాయ్ శీను’, ‘లౌక్యం’ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కమెడియన్‌గా నటించిన రామచంద్ర..కొన్నాళ్ల క్రితం పక్షవాతం బారిన పడ్డాడు. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టి ఆయన ఎడమ చేయి, కాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ఆయన నడవలేని, కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. పెళ్లి కాలేదు. పెరెంట్స్ కన్నమూశారు. ప్రస్తుతం తమ్ముడే తన బాగోగులు చూసుకుంటున్నారు. తాజాగా రామచంద్రను ‘సాక్షి డిజిటల్’ ఇంటర్వ్యూ చేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రామచంద్ర దీనస్థితి చూసి ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు.
ఖర్చులు భరించలేకపోతున్నాం
సాక్షి డిజిటల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామచంద్ర తమ్ముడు మాట్లాడుతూ.. ‘దాదాపు ఏడాదిగా రిహాబిలిటేషన్ సెంటర్‌లోనే రామచంద్ర ఉన్నాడు. ఫిజియోథెరపీ చేయిస్తున్నాం. ఇప్పటికే పలువు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం చేశారు. వారి సహాయం వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాం. అయితే ఇప్పుడు మాకు నెలకు రూ. 2-2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంకో రెండు మూడు నెలలు వరకు ఇక్కడే ఉండాలి. ప్రతిరోజూ అయ్యే వైద్య ఖర్చులు, థెరపీకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. దాతలు స్పందించి ఎంతో కొంత ఆర్థికసాయం అందిస్తే..వైద్యానికి ఉపయోగపడుతుంది’ అని విజ్ఞప్తి చేశారు.


