
టాలీవుడ్‌లో ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మె జరుగుతోంది. తమకు 30 శాతం మేర జీతాలు పెంచి ఇవ్వాలని వర్కర్క్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. దీనికి నిర్మాతలు ఒప్పుకోవట్లదు. ఇప్పటికే సరిపడా ఇస్తున్నామని, ఇకపై పెంచేది లేదని అంటున్నారు. అలానే యూనియన్‌తో సంబంధం లేకుండా ఎవరైనా పనిచేయొచ్చని నోటిఫికేషన్ ఇచ్చారు. అలానే చిరంజీవి కూడా ఈ సమస్యలోకి ఎంటరయ్యారు. ఇంతకీ అసలెం జరుగుతుంది? ప్రస్తుత పరిస్థితేంటి?
(ఇదీ చదవండి: రష్మీతో మనస్పర్థలు.. నిజం బయటపెట్టిన అనసూయ)
వర్కర్క్ యూనియన్స్ వేతనాలు పెంచామని నిర్మాతల్ని కోరుతున్నాయి. నిర్మాతలు మాత్రం ససేమిరా అంటున్నారు. మరోవైపు వేతనాల పెంపునకు అంగీకరించిన 6, 7 సినిమాల షూటింగ్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పంచాయితీ.. చిరంజీవి దగ్గరకు చేరింది. మంగళవారం సాయంత్రం నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సి కళ్యాణ్, మైత్రీ రవి, ఛాంబర్ సెక్రటరీ దామోదరప్రసాద్ తదితరులు చిరంజీవితో సమావేశమయ్యారు. తమ వెర్షన్ విన్నవించారు. ఇదంతా విన్న చిరు.. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతోనూ చర్చించనున్నారు.
రెండు రోజుల్లో చర్చల్లో పురోగతి రాని పక్షంలో ఇరువర్గాలతో మరోసారి చర్చించనున్నారు. ఇప్పటికే వేతనాల పెంపు కోసం కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు చర్చలు జరిపారు. డిమాండ్స్ ఒప్పుకోకపోతే షూటింగ్స్‌కి వెళ్లేది లేదని కార్మికులు అంటున్నారు. మరోవైపు కార్మికుల బెదిరింపులకు భయపడమని నిర్మాతలు అంటున్నారు. వీళ్లు రాకపోతే కొత్త వాళ్లతో షూటింగ్స్ చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు భేటీ కానున్నారు. చిరంజీవి జోక్యంతో సినీ కార్మికుల సమ్మె పరిష్కారం అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ పంచాయితీ ఎప్పటికి తేలుతుందో?
(ఇదీ చదవండి: ఇల్లు కట్టిస్తానని సోనూసూద్ మాటిచ్చారు: షిఫ్ వెంకట్ కూతురు)