పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు | Sakshi
Sakshi News home page

పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు

Published Sat, Nov 25 2023 10:14 AM

Bunny Vasu Clarified With Director Parasuram Issue - Sakshi

తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ నిర్మాణ సంస్థగా గీతా ఆర్ట్స్‌కు మంచి పేరు ఉంది. ఈ బ్యానర్‌లో భాగమైన GA2 నుంచి విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ పరుశురామ్‌ కాంబినేషన్‌లో 'గీత గోవిందం' చిత్రం వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్‌కు అనుగుణంగా వారి ప్రొడక్షన్‌ నుంచి వచ్చే సినిమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు బన్నీ వాస్‌. GA2 బ్యానర్‌లో  ఆయన చాలా సినిమాలే తీశాడు. గీతగోవిందం సినిమా తర్వాత డైరెక్టర్‌ పరుశురామ్‌తో జరిగిన వివాదం గురించి బన్నీ వాస్‌ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు.

'గీత గోవిందం తర్వాత నాతో పరశురామ్ ఒక కథ చెప్పాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. వెంటనే ఆ కథను  విజయ్‌కు ఫోన్ చేసి చెప్పాను. సినిమా చేసేందుకు విజయ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కానీ ఈలోపు దిల్‌ రాజుతో  పరశురామ్ ఇదే కథ చెప్పినట్లు తెలిసింది. దిల్ రాజు బేనర్లో అది చేస్తానని అన్నాడు. ఈ విషయంలో నన్ను, అరవింద్ గారిని ఎంతగానో బాధించింది. పరశురామ్ ఈ విషయాన్ని మాతో సరిగా కమ్యూనికేట్ చేయలేదు. ఇదే విషయం అతడి ద్వారా కాకుండా వేరే మార్గంలో తెలవడంతో మేం బాగానే బాధపడ్డాం.

ఆ సమయంలో మేమంతా కొంచెం కోపంగా ఉన్నాం. అందుకు తగినట్లే పరుశురామ్‌పై రియాక్టయ్యాం. ఆ తర్వాత పరశురామ్ ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు. సర్కారు వారి పాట సినిమా సమయంలో ఏదో ఫ్లోలో దిల్ రాజుకు కథ చెప్పాను ఆయన సినిమా ఓకే చేయడం. ఆ తర్వాత విజయ్‌కి కూడా కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఇదే విషయం మీతో పొద్దున చెబుదామని అనుకున్నలోపే ఇలా జరిగిపోయిందని వివరణ ఇచ్చాడు.

ఆ వివాదం తర్వాత దిల్ రాజు గారు ఫోన్ చేసి.. ఇదే సినిమాలో వాటా కావాలంటే తీసుకో అన్నారు. కానీ అరవింద్ గారు వద్దని చెప్పారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి గొడవ లేదు. త్వరలో విజయ్- పరశురామ్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తాం.' అని బన్నీ వాసు పేర్కొన్నాడు.

గతంలో ఏం జరిగింది..?
గీతగోవిందం చిత్రం హిట్‌ కొట్టడంతో డైరెక్టర్‌ పరుశురామ్‌ చాలా సినిమాలకు ఒకేసారి కమిట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆయన వారి నుంచి కొంతమేరకు అడ్వాన్స్‌ కూడా తీసుకున్నారని అప్పట్లో టాక్‌ వచ్చింది. కానీ ముందుగా అనుకున్నట్లుగా గీతగోవిందం తర్వాత పరశురామ్ అల్లు అరవింద్‌కే సినిమా చేయాల్సి ఉంది. కానీ 14 రీల్స్ బ్యానర్‌లో నాగచైతన్య సినిమా తీసి వస్తానని అల్లు కాంపౌండ్‌ నుంచి ఆయన బయటకు వచ్చేశాడు.

ఆ తర్వాత కూడా మహేశ్‌ బాబు సర్కారువారి పాట సినిమా ఛాన్స్‌ దక్కడంతో నాగచైతన్య సినిమాను పక్కనపెట్టి మహేశ్‌- మైత్రీ మేకర్స్‌ వైపు మొగ్గుచూపాడు. ఆ సమయంలో 14 రీల్స్‌తో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో  సర్కారు వారి పాటలో 14 రీల్స్‌ను కూడా భాగం అయింది.

సర్కారు వారి పాట చిత్రం తర్వాత కూడా దిల్‌ రాజు- విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో 'ప్యామిలీ స్టార్‌' చిత్రాన్ని పరుశురామ్‌ ప్రకటించాడు. దీంతో అల్లు అరవింద్‌కు కోపం వచ్చిందని ఇండస్ట్రీలో వైరల్‌ అయింది. గీతగోవిందం తర్వాత తమతో సినిమా చేస్తానని కమిట్‌మెంట్‌ ఉండగానే దిల్‌ రాజుతో పరశురామ్  సినిమా ఎనౌన్స్ చేయడం అరవింద్‌కు  ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో వార్తలు వైరల్‌ అయ్యాయి. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని తెలిసింది. 

 
Advertisement
 
Advertisement