బిగ్‌బాస్‌ : దేత్తడి కెప్టెన్‌.. అఖిల్‌కి హ్యాండిచ్చిన మోనాల్‌

Bigg Boss Telugu 4 Telugu : Harika Becomes The New Captain - Sakshi

జున్నుని చూసి కంటతడి పెట్టిన లాస్య

కెప్టెన్‌గా ఎన్నికైన హారిక

ఎట్టకేలకు హారిక కెప్టెన్‌ అయింది. గతంలో ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారుగా ఎన్నికై చివర్లో ఓడిపోయిన హారిక.. మోనాల్‌ సాయంతో ఈ సారి తన కోరికను నెరవేర్చుకుంది. అఖిల్‌కి సోహైల్‌ చేసిన సాయం బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక కావాల్సిన సమయంలో మోనాల్‌ తనకు సహాయం చేయలేదని అఖిల్‌ ఫ్రస్టేషన్‌తో ఊగిపోయాడు. తనను నమ్మిన వారికి నేను సాయం చేశానని, గేమ్‌ను గేమ్‌గానే ఆడానని మోనాల్‌ తన పనిని సమర్థించుకుంది. ఇంకా నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏమేం జరిగాయో చదివేయండి

కొడుకుని చూసి భోరుమన్న లాస్య
క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి లాస్య భర్త మంజునాథ్‌, కొడుకు జున్ను వచ్చారు. కుమారుడిని చూడగానే లాస్య భోరున ఏడ్చింది. ‘బుజ్జీ... అంటూ  గార్డెన్‌ ఏరియా నుంచి పరుగెత్తుకొచ్చింది. ఏడ్చుకుంటూనే భర్తతో మాట్లాడింది. ‘నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉన్నావో నీ కన్నా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నాడు జున్ను. అస్సలు ఏడ్వడం లేదు. నువ్వు బాగా ఆడు. చాలా బాగా ఆడుతున్నావు. ఇంకా బాగా స్ట్రాంగ్‌గా ఆడాలి. కిచెన్‌లో ఎక్కువగా ఉండిపోతున్నావు. అక్కడి నుంచి బయటికి వచ్చి గేమ్ బాగా ఆడాలి. 10 వారాల పాటు ఉన్నావంటే నువ్వు ఎంత స్ట్రాంగో అర్థం చేసుకో’ అంటూ లాస్యకు మంజునాథ్‌  ధైర్యం చెప్పాడు.  ఇక జున్నును ఇంటి సభ్యులంతా ఆడించారు. అవినాష్‌ అయితే జోకర్‌ వేసి జున్నును నవ్వించాడు. ఇంటి సభ్యులందరూ లాస్య భర్తతో మాట్లాడుతూ ఆమెపై జోకులు వేశారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులంతా ‘పప్పు’ ఇష్యూని ప్రస్తావిస్తూ ఘొల్లున నవ్వారు. అలాగే ఆంటీ అంటూ లాస్యను ఆట పట్టించారు. లాస్య ఆంటీ కాదని, ఆమె నవ్వు జన్యూన్‌ అని, గేమ్‌ చాలా బాగా ఆడుతుందని ఆమె భర్త చెప్పు కొచ్చాడు. 

అందం గురించి మాట్లాడొద్దు అరియానా..
అరియానా, హారికలు అందంగా ముస్తాబై ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతుండగా... అవినాష్‌ వచ్చి వారిని ఆటపట్టించాడు. చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారని ఆట పట్టించాడు. తమ అందాన్ని చూసి అవినాష్‌  కళ్లు తిప్పుకోలేకపోతున్నాడని అరియానా అనగా.. అందం గురించి మనం మాట్లాడుకోవద్దని అవినాష్‌ పంచ్‌ వేశాడు. అయినప్పుటికీ అరియానా తన అందం గురించి తానే పొగుడుతుండగా.. పిచ్చి పిచ్చిగా చేయ్యొద్దు అరియానా అంటూ తనదైన శైలీలో పంచ్‌లు వేసి నవ్వించాడు. 

బిగ్‌బాస్‌ క్విజ్‌ పోటీ
ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు క్విజ్‌ పోటీ పెట్టాడు బిగ్‌బాస్‌. గార్డెన్‌ ఏరియాలో రిఫ్రిజిరేటర్‌ను పెట్టి.. వారికి  కావాల్సిన లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్‌ను దానిలోపల ఉంచారు. క్విజ్‌ గేమ్‌ ఆడి అవి పొందాలని కండీషన్‌ పెట్టాడు.  క్విజ్‌ మాస్టర్‌గా అవినాష్‌ను ఎంపిక చేసిన బిగ్‌బాస్‌.. పోటీ దారులుగా సోహైల్‌, లాస్య, మోనాల్‌, అభిజిత్‌ను పెట్టాడు. సరైన సమాధానం చెప్పిన ఇంటి సభ్యుడు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసి ఒక లగ్జరీ బడ్జెట్ ఐటమ్ తీసుకోవచ్చు. ప్రశ్నలు కూడా సింపుల్‌గా, నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో లాస్య ఎక్కువగా ఎక్కడ గడుపుతోంది? అనే ప్రశ్నంగా ఇంటి సభ్యులంతా ముక్తకంఠంతో కిచెన్‌లో అని సమాధానం చెప్పుతూ ఘొల్లున నవ్వారు. మొత్తంగా అందరూ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పి లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్‌ని పొందారు. ఇక అభిజిత్‌ అయితే అన్ని ప్రశ్నలకు చకచక సమాధానం చెప్పాడు.

కెప్టెన్‌గా దేత్తడి
క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌ టాస్క్‌ స్టార్స్‌ సాధించిన అఖిల్‌, అభిజిత్‌, హారికలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు మిగతా ఇంటి సభ్యులను ఒప్పించి వారి భుజాల మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేపు కిందికి దిగకుండా భుజాల మీద ఉంటారో వాళ్లు ఇంటి కెప్టెన్‌ అవుతారు. అలాగే ఎత్తుకున్న వ్యక్తి బాక్స్‌ దాటినా ఓడిపోయినట్లే లెక్క. ఎట్టకేలకు కెప్టెన్‌ పోస్ట్‌ కొట్టేయాలని కసితో ఉన్న అఖిల్‌ తెలివిగా సోహైల్‌ని ఎంచుకున్నాడు. అభిజిత్‌ అవినాష్‌ను, మారిక మోనాల్‌ని ఎంచుకుంది. మొదటగా అభిజిత్‌ బరువును మోయలేక అవినాష్‌ చేతులేత్తేశాడు. ఆ తర్వాత ఎంతసేపైనా  ఉంటానని గొప్పలు చెప్పిన సోహైల్‌ .. అఖిల్‌ని మోయలేక కిందపడిపోయాడు. దీంతో మోనాల్‌ భుజాలపై ఉన్న హారిక కెప్టెన్‌గా ఎన్నికైంది. ఎనిమిది సార్లు పోటీ పడినా.. గెలవలేదని, ఈ సారి మోనాల్‌ సాయంతో గెలిచానని హారిక ఆనందంతో చిందులేసింది. మోనాల్‌ని గట్టిగా హగ్‌చేసుకొని ముద్దులు పెట్టింది. నోయల్‌ టీషర్‌ వేసుకొని ఈ టాస్క్‌ ఆడాడని, తన అమ్మకి  ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్‌ అయ్యానని సంతోషంతో ఉబ్బితబ్బిపోయింది. 

హ్యాండిచ్చిన మోనాల్‌.. అలిగిన అఖిల్‌
ఇక కెప్టెన్సీ టాస్క్‌ ఓడిపోయిన బాధలో ఉన్న అఖిల్‌ని సోహైల్‌ ఓదార్చాడు. తాను శాయశక్తులా కృషి చేశానని, తన టాస్క్‌లాగే ఆడానని, అయినా గెలవలేకపోయామని అఖిల్‌తో చెబుతూ బాధపడ్డాడు. మోనాల్‌ కూడా వచ్చి అఖిల్‌ని ఓదార్చపోగా.. తనకు కొంచెం టైం కావాలని ఆమెను పంపించేశాడు. ఆమె వెళ్లిపోగానే.. అఖిల్‌ కోపంతో చేతిని నేలకేసి కొట్టాడు. సోహైల్‌ వెళ్లి దగ్గరకు తీసుకొని మరోసారి ఓదార్చాడు. అయితే మోనాల్‌ తనుకు హెల్ఫ్‌ చేస్తుందని భావించానని, కానీ తనను కాదని హారికకు సాయం చేసిందని చెబుతూ బాధపడ్డాడు. కాగా, తనను అఖిల్‌ నమ్మలేదని, హారిక నన్ను నమ్మి టాస్క్‌లో సాయం చేయమని కోరిందని అందుకే ఆమెకు సపోర్ట్‌ చేశానని మోనాల్‌ చెప్పుకొచ్చింది. 

ఫోన్‌ లేకపోతే మనిషి విలువ తెలిసింది : సోహైల్‌
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకున్న విషయాలు ఏంటి? మీలో వచ్చిన మార్పులు ఏంటో హౌస్‌మేట్స్‌తో పంచుకోండని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో సోహైల్‌ తాను నేర్చుకున్న విషయాలు ఇంటి సభ్యులతో పంచుకున్నాడు. ‘ బిగ్‌బాస్‌లోకి రాక ముందు పుడ్‌ విలువ తెలిసేది కాదు. ఇక్కడి వచ్చాకే ఫుడ్‌ వాల్యూ తెలిసింది. కోపం కూడా తగ్గింది. గతంలో ఎక్కుమ సమయం ఫోన్‌తోనే గడిపేవాడిని. ఎవరు పిలిచినా అంతగా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇక్కడ మనుషులతోనే ఎక్కువ సమయం గడుపుతున్నా. ఫోన్‌ లేకపోతే మనిషి విలువ తెలుస్తోంది’ అని సోహైల్‌ చెప్పాడు. ఇక అరియానా మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లోకి వచ్చాక తనకు సమయం విలువ బాగా తెలిసిందని, చిన్న చిన్న విషయాలకు కృతష్నులై ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. 

 పనిష్మేంట్‌గా స్టెప్పులేని ఇంటి సభ్యులు
ఇక కెప్టెన్‌ అయిన హారికపై అభిజిత్‌ జోకులు వేశాడు. మోనాల్‌ ఎంత పని చేశావ్‌ అంటూ.. ఆమెను ఎందుకు కెప్టెన్‌ చేశావు ఆని హారికను ఆటపట్టించాడు. అయితే హారిక మాత్రం అభిజిత్‌కు గట్టిగానే ఇచ్చిపడేసింది. ‘ నా మీద జోకులు వేస్తే నేను ఊరుకోవాలి. నీ మీద వేస్తనేమో సీరియస్‌ అవుతావు. నేను జోకులు వేసినప్పుటు సీరియస్‌ కావాలి కానీ.. నీ పని చెప్తా చూడు’ అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇక కెప్టెన్‌ అయిన ఆనందంలో మైక్‌ ధరించకుండానే ఇళ్లంతా తిరుగున్ను హారికను బిగ్‌బాస్‌ నుంచి ‘మైక్‌ ధరించు హారిక’ అనే అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. దీంతో కెప్టెన్‌ హారికనే ఇంటి నియమాలు పాటిస్తలేదంటూ ఇంటి సభ్యులంతా హారికను ఆటపట్టించారు. పనిష్మెంట్‌గా హారికతో పాటు మిగతవారంతా స్టెప్పులేస్తూ బిగ్‌బాస్‌కు క్షమాపణ చెప్పారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top