
బిగ్‌బాస్ నాల్గో సీజన్ నుంచి అమ్మ రాజశేఖర్ వెళ్లిపోవడంతో హౌస్‌లో సగానికి సగం గొడవలు తగ్గినట్లే అని అందరూ భావించారు. అయితే ఇవాళ సోమవారం కావడంతో విమర్శలు, వివాదాలు హౌస్‌లో పుష్కలంగా లభిస్తాయి. పదో వారంలోకి అడుగు పెట్టాక కూడా ఇంకా మొహమాటం ఏముంటుంది? ఇంటిసభ్యులందరూ ఎలాంటి దాపరికాలు లేకుండా నామినేట్ చేయాలనుకునే కంటెస్టెంట్ల నెత్తి మీద బాటిళ్లు పగలగొడుతున్నారు. గతవారం అందరూ అమ్మ రాజశేఖర్‌ను టార్గెట్ చేయగా ఈసారి ఆయనకు అసిస్టెంట్ కెప్టెన్‌గా వ్యవహరించిన అరియానాను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో మెహబూబ్, హారిక, సోహైల్, మోనాల్, అభిజిత్.. అరియానాను నామినేట్ చేసినట్లు కనిపించింది. మోనాల్‌తో అప్పుడప్పుడు పులిహోర కలుపుతూ కనిపించే అవినాష్ మోనాల్‌తో పాటు హారికను నామినేట్ చేశాడు.
ఇక అరియానా తన వంతు రాగా కుండ బద్ధలు కొట్టినట్లు అభిప్రాయాలు చెప్పింది. మధ్యలో హారిక మాట్లాడేందుకు ప్రయత్నించగా నేను మాట్లాడాక మాట్లాడు అని వేలెత్తి చెప్పింది. దీన్ని సహించని హారిక అభ్యర్థించు, కానీ ఆర్డర్ ఇవ్వకు అని కౌంటర్ ఇచ్చింది. అయితే అప్పటికే ఏదో మాట్లాడాలని డిసైడ్ అయిన అరియానా తాను అలాగే ఉంటానని తేల్చి చెప్పింది. అనంతరం మోనాల్ ఫేక్ అనిపిస్తుందంటూ ఆమె తల మీద బాటిల్‌తో ఫడేలుమని కొట్టింది. అంత మాటన్నాక మోనాల్ రియాక్టవక తప్పలేదు. (చదవండి: నీ కాళ్లు పట్టుకుంటా, ఏం చేసుకోకు: అరియానా)
'నా మీద నీకేమైనా పగ ఉందా? అని అరియానాను ముఖం పట్టుకుని అడిగింది. టీ స్టాండు టాస్కులో నా ముఖాన చల్ల నీళ్లు విసిరికొడుతుంటే బాధతో విలవిల్లాడుతూ అరిచాను. దానికి ఓ మై గాడ్, ఈవిడేంటి ఇంత అరుస్తుంది? అని ఎగతాళి చేశావు. నేనెంత నొప్పి అనుభవించానో నీకేం తెలుసు?' అని మోనాల్ ఆగ్రహంతో ఊగిపోయింది. వీటికి సమాధానం చెప్పలేక అరియానా నీళ్లు నమిలింది. అయితే అందరూ తనను గేమ్ కోసం నామినేట్ చేస్తున్నారంటే.. తాను మాత్రమే ఇక్కడ గేమ్‌పై ఫోకస్ పెడుతున్నాను అని డైలాగ్ విసిరింది. మొత్తానికి ఈ వారం అభిజిత్, అరియానా, మెహబూబ్, సోహైల్, హారిక, మోనాల్ నామినేట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. (చదవండి: శభాష్ అరియానా, నీకో న్యాయం, ఎదుటోడికో న్యాయం)