సామాన్యుడు బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)దాకా రావడమనేది చిన్న విషయం కాదు. షోలో అడుగుపెట్టడమే కాకుండా ఏకంగా టైటిల్ రేసులో ఉండటం అంటే చాలా గొప్ప విషయం! ట్రోఫీ గెలుస్తాడా? లేదా? అని పక్కనపెడితే టాప్ 3లో చోటు దక్కించుకున్నా సరే అతడు గెలిచాడనే చెప్పాలి. అతడే పవన్ కల్యాణ్ పడాల.
విమర్శల నుంచి పొగడ్తల వరకు
చిన్న పల్లెటూరు నుంచి ఆర్మీకి... అక్కడ బ్రేక్ ఇచ్చి బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). మొదట్లో తనూజను చూసేవిధానం, మాట్లాడే విధానం ఎవరికీ నచ్చలేదు. అమ్మాయిల పిచ్చోడు అని తనపై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ తిట్టిన నోళ్లతోనే పొగిడించుకునేలా చేశాడు. తన తీరు మార్చుకున్నాడు, ఆట మార్చాడు.
వద్దు వద్దంటూ..
అందుకే ఇప్పుడు ఎంతోమందికి ఫేవరెట్ అయ్యాడు. చిన్నప్పుడు అమ్మానాన్న సావాసాన్ని మిస్ అయ్యానని చెప్తూ ఇటీవలి ఎపిసోడ్‌లో బోరుమని ఏడ్చాడు కల్యాణ్. కానీ, ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి తనకు ఇంట్లోవాళ్లు రావొద్దని, కావాలంటే ఎవరికోసమైనా త్యాగం చేయడానికైనా రెడీ అంటూ పిచ్చిపట్లునట్లు ప్రవర్తించాడు. తీరా కళ్ల ముందు తల్లి కనిపించేసరికి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు.
మాటిచ్చిన కల్యాణ్
ఇంత బాధ పెట్టుకున్నావేంట్రా పిచ్చోడా అని తల్లి అడిగేసరికి అమ్మ కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడిలా మారిపోయాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలి అని తల్లి అడిగింది. అందుకు కల్యాణ్ తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానంటూ ఆమె చేతిలో చేయేసి మాటిచ్చాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఎమోషనల్‌గా సాగనుంది.


