
ఎప్పటిలానే వీకెండ్ ఎపిసోడ్ కాస్త సందడిగానే జరిగింది. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లో దసరా సెలబ్రేషన్స్ చేశారు. దీంతో ఆటపాటలతో సందడి సందడిగా కనిపించింది. అయితే ఇదే ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ ఫేకే గేమ్ ఆడుతున్న కొందరికి నాగ్ చీవాట్లు పెట్టాడు. రీతూ-పవన్‌ని నాగార్జున తెగ రెచ్చగొట్టాడు. మరోవైపు అనుకున్నట్లు ప్రియ ఎలిమినేట్ అయిపోయింది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్‌లో ఏమేం జరిగింది? కొత్త కెప్టెన్ ఎవరయ్యారు?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం)
హౌస్‌లో ఉన్నవాళ్లని రెండు జట్లుగా విడగొట్టిన నాగార్జున ఓవరాల్‌గా ఐదు గేమ్స్ పెట్టాడు. వీటిలో గెలిచిన టీమ్‌కి ఒక్కో ఆయుధాన్ని ఇచ్చారు. అలా ఇమ్మాన్యుయేల్‌కి సంబంధించిన టీమ్ రెడ్ విజేతగా నిలిచింది. ప్రతి పోటీలో గెలిచినప్పుడు ఒక్కొక్కరికి చొప్పున హరీశ్, రీతూ, సంజన, పవన్, రాముకు వాళ్ల ఇంటి నుంచి మెసేజ్ లేదా వాయిస్ నోట్ లేదా ఫొటోస్ వచ్చాయి. చివరగా వీళ్లు ఐదుగురే కెప్టెన్సీ రేసులో ఉన్నారని చెప్పి నాగ్ షాకిచ్చాడు. వీళ్ల ఐదుగురికి బుట్టబొమ్మ అని ఓ పోటీ పెట్టగా అందులో నెగ్గిన పవన్.. రెండోసారి కెప్టెన్ అయిపోయాడు.
ఇకపోతే బిగ్‌బాస్ 9వ సీజన్ మొదలైపోయి మూడు వారాలు పూర్తయింది. అయినా సరే ఇప్పటికీ హౌస్‌లో జోష్ లేదు. దీనికి కారణం హౌస్‌మేట్సే. ఎందుకంటే వచ్చిందే ఎంటర్‌టైన్ చేయడానికి, అది మానేసి చేయాల్సిన అతి అంతా చేస్తున్నారు. దీంతో 'ఆస్క్ బీబీ టీమ్' పేరుతో హోస్ట్ నాగార్జున.. ఒక్కొక్కరికి గట్టిగానే కౌంటర్స్ వేశాడు. అయితే నాగ్ అడిగిన ప్రశ్నలన్నీ ఆడియెన్స్ నుంచి వచ్చినవే. దీనికి సదరు కంటెస్టెంట్స్ నుంచి సమాధానాలు నిజమా అబద్ధమా అనేది కూడా ఆడియెన్సే నిర్ణయించారు. వీళ్లలో సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, సంజన, ఫ్లోరా తదితరలు మాత్రమే జెన్యూన్ అని షో చూస్తున్న ప్రేక్షకులు కుండబద్ధలు కొట్టేశారు. తద్వారా షోలో అస్సలు జోష్ లేదని చెప్పకనే చెప్పినట్లయింది. మరి ఇప్పటికైనా మిగిలిన హౌస్‌మేట్స్ తమ గేమ్‌ని బయటపెడతారా అనేది చూడాలి?
హౌసులో మొన్నటివరకు జంటగా తిరిగిన రీతూ-పవన్ మధ్య గతవారం మనస్పర్థలు వచ్చాయి. అలానే రీతూతో కల్యాణ్ కూడా కాస్త క్లోజ్‌గా ఉంటూ వస్తున్నాడు. గతవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన దివ్య.. వీళ్ల ముగ్గురిని చూసి ట్రయాంగిల్ అనే పదం ఉపయోగించింది. ఆదివారం ఎపిసోడ్‌లో హౌస్ట్ నాగార్జున అయితే పదేపదే ఈ పదాన్ని ఉపయోగిస్తూ రీతూ-పవన్‌ని రెచ్చగొట్టాడు. వచ్చిన సెలబ్రిటీలకు కూడా వీళ్ల గురించి చెప్పారు. దీంతో వివరణ ఇచ్చిన పవన్.. నాగార్జునకు క్లారిటీ ఇస్తూనే మరోవైపు రీతూతోనూ ఉన్న మనస్పర్థల్ని క్లియర్ చేసుకున్నాడు.
ఎలిమినేషన్ విషయానికొస్తే.. శనివారం ఎపిసోడ్‌లో ఇమ్యూనిటీ దక్కించుకుని ఫ్లోరా సేవ్ అయిపోయింది. మిగిలిన ఐదుగురు హరీశ్, ప్రియ, రీతూ, కల్యాణ్, రాములలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరగా కల్యాణ్, ప్రియ మిగిలారు. అయితే తాను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానో అని ముందే కల్యాణ్ గట్టిగా ఏడ్చేశాడు. ప్రియ ఎలిమినేట్ అయింది గానీ కల్యాణ్ గుక్కపెట్టి ఏడ్చాడు. ఆమెని పట్టుకుని కాసేపు వదల్లేదు. చివరగా ప్రియని హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఆమె వెళ్తూవెళ్తూ హరీశ్, తనూజ, భరణి డెవిల్ ట్యాగ్స్ ఇచ్చింది.
(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?)