
జింతాత జితా జితా.. జింతాత తా.. శనివారం ఎపిసోడ్ చూశాక ఈ పాట కచ్చితంగా వేసుకోవాల్సిందే! ఆ రేంజ్‌లో ఉంది నాగార్జున హోస్టింగ్. మేమే తోపు, ఇల్లంతా మాదే అన్న భ్రమలో బతికేస్తున్న సామాన్యుల మబ్బులు విడిపోయేలా క్లాస్ పీకాడు. ముఖ్యంగా ప్రతిదానికీ గొడవపడటం ఒక్కటే మార్గం అన్నట్లుగా నోరేసుకుని పడిపోతున్న ప్రియ, శ్రీజల నోటికి తాళం వేసేలా మాట్లాడాడు. అసలు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో వివరంగా చూసేద్దాం..
ఒళ్లంతా కళ్లు లేవు
నాగార్జున (Nagarjuna Akkineni) వచ్చీరావడంతోనే రీతూ చౌదరి సంచాలక్‌గా ఫెయిలైందని వీడియో ఆధారాలతో సహా బయటపెట్టాడు. భరణిని కావాలనే గేమ్‌లో ఎలిమినేట్ చేసిందని చూపించాడు. పవన్ కెప్టెన్ అవాలని ముందునుంచే నిర్ణయించుకున్న ఆమె అనుకున్న ప్రకారం అతడిని కెప్టెన్ చేసిందన్నాడు. రీతూ మాత్రం.. నాకున్నవి రెండే కళ్లు, బాడీ మొత్తం లేవు కదా.. టాస్క్‌లో పవన్ వేరేవాళ్లకు రంగు పూసింది కనిపించలేదు. నాకతడిపై సాఫ్ట్ కార్నర్ లేదు. కావాలని గెలిపించలేదు అని కహానీలు చెప్పింది.
సారీ చెప్పిన రీతూ
కానీ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ రీతూ (Rithu Chowdary) తప్పు నిర్ణయం తీసుకుంది సార్. ప్రియ, శ్రీజ, మనీష్ శాడిస్టులుగా ప్రవర్తించారు. టెనెంట్స్‌కు అన్యాయం జరిగింది అన్నారు. దాంతో రీతూ చేసేదేంలేక సారీ చెప్పింది. అయితే ప్రియ, శ్రీజ మాత్రం మేమేం తప్పు చేశాం? అని ఏమీ ఎరగనట్లే మాట్లాడారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నాం, అందులో తప్పేముంది? అని ప్రశ్నించింది.
ప్రియ, శ్రీజలకు ఇచ్చిపడేసిన నాగ్
దీనికి నాగ్.. షోకి వెళ్లేవరకు మాత్రమే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మాత్రమే అని క్లాస్ పీకాడు. ఎంతసేపూ తుత్తుత్తు అంటూ మాట్లాడతారు. ఇద్దరూ కాదు, ఎవరో ఒకరే మాట్లాడండి అని ప్రియ, శ్రీజలను హెచ్చరించాడు. అలాగే ప్రియ సంచాలక్‌గా ఫెయిలైన వీడియో (చక్రం టాస్క్‌లో పవన్ కల్యాణ్ ఫౌల్ గేమ్) కూడా ప్లే చేశాడు. మొదట తనది తప్పేనని ఒప్పుకున్న ఆమె.. తర్వాత తనసలు తప్పు చేయలేదు, అంతా కరెక్ట్‌గానే ఉందని నాగార్జునతోనే వాదించింది.

ఇది కరెక్ట్ కాదు సార్
ఇక మరోవైపు డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు చేసిన నాగ్ మళ్లీ కెప్టెన్సీ టాస్క్ పెడతానని ప్రకటించాడు. ఈసారి కూడా రీతూ చౌదని సంచాలక్‌గా ఉంటుందని వెల్లడించాడు. ఇది నచ్చని శ్రీజ.. ఇది కరెక్ట్ కాదు సార్.. అంటూ నాగార్జుననే ఎదిరించింది. సంచాలక్ చేసిన తప్పుకి ప్లేయర్‌ను తీసేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. పవనే ఈ కెప్టెన్సీ వద్దనుకుంటున్నాడు. ఫెయిర్‌గా ఆడి గెలవాలనుకుంటున్నాడు. నీకేంటి సమస్య? ప్రతి విషయంలో తుత్తుత్తు అని వస్తావ్ అని శ్రీజ దుమ్ము దులిపేశాడు.
బండ్లు ఓడలు.. ఓడలు బండ్లంటే ఇదే!
అలా నెత్తికెక్కిన కామనర్ల కళ్లు కిందకు వచ్చేలా చేశాడు. నాగార్జున కామనర్లపై విరుచుకుపడినప్పుడల్లా ప్రేక్షకుల చప్పట్లతో స్టూడియో దద్దరిల్లిపోయింది. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే.. ఓనర్లను టెనెంట్లుగా, టెనెంట్లను ఓనర్లుగా మార్చేశాడు. ఓనర్‌షిప్ గెలిచి సాధించుకున్న రాము, భరణి ఓనర్లుగానే కొనసాగుతారన్నాడు. మరి టెనెంట్లయ్యాకైనా కామనర్ల గర్వం అణుగుతుందేమో చూడాలి!