వీకెండ్ వచ్చిందంటే క్లాసులు పీకడమే నాగార్జున చేసే ఏకైక పని. సంజనా, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణికి పెద్ద లెక్చర్‌లే ఇచ్చాడు. కానీ పవన్‌ను మాత్రం ఏకంగా ఏడిపించేశాడు. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో శనివారం (నవంబర్ 1వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
బెస్ట్ కెప్టెన్
రేషన్ మేనేజర్ తనూజ (Thanuja Puttaswamy)కే ఆర్డర్ వేస్తావా? అని కల్యాణ్‌ను, నామినేషన్ చేసిన పాయింటే తప్పని ఇమ్మాన్యుయేల్‌ను ఏకిపారేశాడు నాగ్. సుమన్‌ను అసమర్థ కెప్టెన్ అన్న సంజనాని సైతం తప్పుపట్టాడు. ప్రేక్షకులతో సుమన్ బెస్ట్ కెప్టెన్ అనిపించేలా చేశాడు. కెప్టెన్సీ గేమ్‌లో భరణి గోడమీద పిల్లిలా సేఫ్ గేమ్ ఆడటాన్ని ఖండించాడు. ఇలాగే ఉంటే ఎక్కువరోజులు ఉండలేవని వార్నింగ్ ఇచ్చాడు. ఇక వారమంతా ఎప్పుడుపడితే అప్పుడు గొడవలు పెట్టుకుంటూ, దాన్ని సాగదీస్తూ మహా చిరాకు తెప్పించారు పవన్-రీతూ.

డోర్స్ ఓపెన్
వీళ్లకు నాగార్జున గట్టి క్లాస్ పీకితేకానీ బుద్ధి రాదని ప్రేక్షకులు ఎదురుచూశారు. తీరా నాగార్జున (Nagarjuna Akkineni) ఊహించినదానికన్నా ఎక్కువ సీరియస్ అవడంతో పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆడపిల్లను తోసేస్తావా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? నీ బ్యాగులు సర్దుకో.. డోర్స్ ఓపెన్ అంటూ తక్షణమే వెళ్లిపోవాలన్నాడు. ఆ మాటకు పవన్ నిలువెల్లా వణికిపోయాడు. ఇంకోసారి ఆ తప్పు రిపీట్ చేయను సార్ అని వేడుకున్నాడు.
చేతులు జోడించి వేడుకున్న పవన్
అటు రీతూ (Rithu Chowdary) కూడా.. ఇద్దరం గొడవపడుతున్నాం.. నేను వెళ్లిపోతున్నాననే ఆవేశంలో అలా తోశాడు. ఈసారికి వదిలేయండి అని వేడుకుంది. అయినా నాగ్ కనికరించలేదు. బిగ్‌బాస్ ఇంటి డోర్ తెర్చుకోవడంతో పవన్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది రీతూ. నువ్వు కోపంలో అలా చేశావ్, నాకు తెలుసు.. స్ట్రాంగ్‌గా ఉండు.. సార్‌కు అర్థమయ్యేలా వివరించు.. ఆయనకు సారీ చెప్పు అని బోధించింది. దీంతో అతడు సారీ సర్.. ఇంకోసారి రిపీట్ చేయను, ఈ ఒక్కసారికి క్షమించండి అని దీనంగా చేతులు జోడించి అడిగాడు.

క్షమించేది లేదన్న నాగ్
ఈసారి నాగార్జున హౌస్‌మేట్స్ అభిప్రాయాలు అడగ్గా.. ఎవరూ కూడా అతడికి ఎలిమినేట్ అయ్యేంత పెద్ద శిక్ష విధించాలని కోరుకోలేదు. అప్పుడు నాగ్.. ఇది హౌస్‌కు మాత్రమే సంబంధించిన విషయం కాదు, షో ఇమేజ్‌కు సంబంధించింది. మీ తరువాత వచ్చేవాళ్లు ఈ సంఘటనను చూసి ఇలాగే ప్రవర్తిస్తే షో పడిపోతుంది. కాబట్టి నేను క్షమించలేను అన్నాడు. ఇంతలో రీతూ మాట్లాడుతూ.. వాడు నన్నేదో చేయాలనే ఉద్దేశం కాదు సార్.. ఇద్దరం గొడవపడుతుంటే మాట వినకుండా వెళ్లిపోతున్నాననే అలా నెట్టాడు. అంత చిన్నదానికి హౌస్‌లో నుంచి పంపించొద్దు అని బతిమాలింది.
మోకాళ్లపై కూర్చుని సారీ
అందుకు నాగ్ మాట్లాడుతూ.. మాధురి మీది అన్‌హెల్దీ బాండ్ అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. అలా అనడానికి ఆమెకేం హక్కు ఉందనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీది కచ్చితంగా అన్‌హెల్దీ బాండింగే.. అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. రీతూకే కాదు, ఆడియన్స్‌కు కూడా క్షమాపణ చెప్పాలని పవన్‌ను ఆదేశించాడు. దీంతో పవన్.. రీతూ కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. మోకాళ్లపై కూర్చుని.. నేనలా చేసి ఉండకూడదంటూ తలవంచుకుని సారీ చెప్పాడు. అప్పటికి శాంతించిన నాగార్జున.. తెరుచున్న బిగ్‌బాస్ ఇంటి డోర్లను మూయించేశాడు.


