గతంతో పోలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్‌బాస్ హౌసులో కాస్త డ్రామా కనిపిస్తోంది. ఈ వారమంతా కూడా భరణి, శ్రీజ మధ్యలో పోటీ పెట్టి రీఎంట్రీ ఎవరు ఇవ్వబోతున్నారనేది తేల్చారు. చివరకు గెలిచిన భరణి.. హౌసులోకి మళ్లీ వచ్చేశాడు. ఇక వీకెండ్ వచ్చిందంటే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి కూడా అలానే ఒకరు బయటకెళ్లిపోయారు. కానీ ఒకరు అనుకుంటే మరొకరు ఔట్ అయ్యారట.
8వ వారం నామినేషన్స్‌లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. వీళ్లలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్.. తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చారు. దీంతో వీకెండ్ అయ్యేసరికి వీళ్లకే తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ ఏర్పడింది. తొలుత గౌరవ్ బయటకొచ్చేశాడని రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్‌గా మాధురి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: హీరోగా లోకేశ్ కనగరాజ్.. మూవీ టీజర్ రిలీజ్)
మరోవైపు లేటెస్ట్ ప్రోమోలో మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. రీతూ-పవన్‌కి సంబంధించిన ఓ వీడియో చూపించిన హోస్ట్ నాగార్జున.. పవన్‌పై సీరియస్ అయ్యారు. ఈ వీడియోలో పవన్.. రీతూని బెడ్‌పైకి తోస్తూ కనిపించాడు. బిగ్‌బాస్ నిబంధనల ప్రకారం.. తోసేయడం, తన్నడం లాంటివి చేయకూడదు. వీడియో ప్లే చేసిన తర్వాత.. 'ఇలాంటి ప్రవర్తన మీ ఇంట్లో ఆడపిల్లలపై చేస్తే బెల్ట్ పెట్టి కొట్టేవారా కాదా ఆడియెన్స్' అని నాగ్ అడిగాడు. అలా తోయడం కరెక్ట్ కాదని ఆడియెన్స్ అనేసరికి.. 'సారీ సర్' అని పవన్ అన్నాడు.
సారీ చెబితే బిగ్‌బాస్ క్షమించడు. నీకు రెడ్ ఫ్లాగ్ తప్పదు. నీ బ్యాగ్ సర్దుకే. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అని నాగార్జున అన్నాడు. దీంతో పవన్ దీనంగా ముఖం పెట్టి కనిపించాడు. మరోవైపు రీతూ.. 'సార్ సార్ వద్దుసార్' అని నాగార్జునని ప్రాధేయపడుతూ కనిపించింది. అయితే ఇదంతా డ్రామా నడిపించడమే కోసమే అనిపిస్తుంది. ఎందుకంటే గత సీజన్లలో ఇలాంటి హంగామా చాలాసార్లు చూపించారు. దీంతో పవన్ బయటకెళ్లడం జరగదులే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్)


