బిగ్‌బాస్ హౌస్ (Bigg Boss Telugu 9)లో ఏది జరిగినా ఒకరోజు ఆలస్యంగా చూపిస్తారు. అలా శుక్రవారం రోజు జరిగినదాన్ని నేడు ఎపిసోడ్‌లో చూపించనున్నారు. ఇక ఫ్రైడే అంటే పెద్దగా టాస్కులేవీ ఉండవు. కేవలం ఫన్ గేమ్స్ మాత్రమే ఉంటాయి. ఇటువంటి ఫన్ గేమ్స్ దగ్గరా గొడవ పడొచ్చని నిరూపించారు తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ కంటెస్టెంట్స్.
తిండి దగ్గర లొల్లి
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిర్యానీ టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ పూర్తయ్యాక అందరూ ప్లేటులో బిర్యానీ వేసుకుని ఆవురావురుమని ఆరగించారు. ఓపక్క అందరూ తింటుంటే మాధురి అప్పుడే వచ్చి ప్లేటులో బిర్యానీ వేసుకోబోయింది. అది చూసిన భరణి, దివ్య వెంటనే ఆపేశారు. వేరే టీమ్‌కు ఇంకా పీసులు వెయ్యలేదు, వారికి వేశాక మీకు పెడతాను అని భరణి అడ్డుకున్నాడు. దీంతో మాధురి హర్టయిపోయింది. నీళ్లు తాగి కడుపు నింపుకుంది.
ఆయనకు నోరు లేదా?
చిన్నచిన్నవాటికెందుకిలా.. అని భరణి (Bharani Shankar) వివరించబోయాడు. ఇంతలో దివ్య.. మధ్యలో కలగజేసుకుని మాట్లాడటంతో మాధురి అక్కడినుంచి లేచి వెళ్లిపోయింది. ప్లేటు పట్టుకున్నప్పుడు అలా అనేస్తే ఎలా తింటాం? అతడు అడుగుతున్నదానికి సమాధానం చెప్తున్నా.. మధ్యలో ఈమె (దివ్య) వివరణ ఇవ్వడం దేనికి? ఆయనకు నోరు లేదా? మాట్లాడలేడా? అని మాధురి.. కల్యాణ్ ఎదుట తన కడుపులో ఉన్నదంతా కక్కేసింది.
మీ గేమ్ మీరు ఆడండి
ఇక ఈ గొడవయ్యాక తనూజ.. భరణితో ఇది మీ గేమ్ మీరు ఆడండి.. మధ్యలో దివ్య ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు అంది. నిజమే.. దివ్య ఇలా భరణిపై పెత్తనం చెలాయిస్తే అది అతడికే నెగెటివ్ అయి మళ్లీ ఎలిమినేట్ అవడం ఖాయం. మరి భరణి ఏం చేస్తాడో చూడాలి!


