
బిగ్‌బాస్ 9 కంటే ముందు వస్తోన్న బిగ్‌బాస్ అగ్నిపరీక్ష షో (Bigg Boss Agnipariksha)పై మంచి బజ్ ఉంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ గురించి రెండు ప్రోమోలు రిలీజ్ చేయగా తాజాగా మూడో ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఫేమస్ యూట్యూబర్ గంగవ్వ వయసులో ఉన్న ఓ ముసలమ్మ స్టేజీపై అడుగుపెట్టింది. నెత్తిన బోనంతో పాటలు పాడుకుంటూ జోష్‌గా వచ్చింది. నల్గొండ దగ్గర కొండతిరుమలగిరి మా ఊరు.. చాలా కష్టాలు పడ్డాను సర్.. నా చిన్నబిడ్డ నన్ను, నా భర్తను పోషిస్తోంది. నా భర్తకు పక్షవాతం వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మీ అందరినీ కలిశా.. ఈ జన్మకు ఇంతే చాలు అని ఎమోషనలైంది.
మాకు నిద్రుండదు
ఆయన స్టోరీ విన్న అభిజిత్.. మీ జీవితంలో సగం కూడా నేను చూడలేదు, కానీ లోపల ఆట నేను చూశాను. ఆ గేమ్ మీకు చాలా కష్టంగా ఉంటుందవ్వా.. అన్నాడు. అందుకామె మాత్రం నాకు తోచినంత ఆడతా.. అని తన ఆసక్తిని చూపించింది. తర్వాత దివ్యాంగుడు ప్రసన్నకుమార్ స్టేజీపైకి వచ్చాడు. అతడి స్టోరీ విన్న నవదీప్.. ఈ కథను మేము ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర ఉండదు అంటూ గ్రీన్ సిగ్నల్ చూపించాడు.
అర్ధరాత్రి షో
ఇదంతా బాగానే ఉంది కానీ షో టైమింగ్స్ మాత్రమే కాస్త తేడాగా ఉంది. ఎప్పుడూ బిగ్‌బాస్ రాత్రి 9 లేదా 9.30 గంటల ప్రాంతంలో వచ్చేది. కానీ ఈ అగ్నిపరీక్ష మాత్రం ఎటూ కాకుండా అర్ధరాత్రి 12 గంటలకు రానుంది. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు జియో హాట్‌స్టార్‌లో కొత్త ఎపిసోడ్ అప్‌లోడ్ చేస్తారు. ఫలానా సమయం అని లేకుండా రోజులో మీకు నచ్చినప్పుడు దాన్ని చూసుకోవచ్చన్నమాట! ఇది చాలామందికి నచ్చడం లేదు. అగ్నిపరీక్షకు ప్రత్యేక సమయం కేటాయిస్తేనే బాగుంటుంది, ఇలా అర్ధరాత్రి అప్‌లోడ్ చేయడం అనవసరం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ నటి