బిగ్‌బాస్‌: అరియానా, అవినాష్‌ జంటకు క్రేజీ ఆఫర్‌

Bigg Boss 4 Telugu: Ariyana Glory and Avinash to host TV shows - Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి వచ్చిన చాలా మంది.. ఇప్పుడు సెలెబ్రెటీలు అయిపోయారు. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్లు ఏం ఆశించి హౌస్‌లోకి వచ్చారో.. అంతకంటే ఎక్కువ క్రేజ్‌ సంపాదించారు. గత మూడు సీజ‌న్ల‌తో పోలిస్తే ఈసారి బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారికి కాస్త  ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా యూట్యూబ‌ర్లు, చిన్న న‌టీన‌టులు పాల్గొనప్ప‌టికీ.. వారికి ఇప్పుడు మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా గెలిచిన అభిజీత్‌కి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక మూడో స్థానంలో నిలిచిన సోహైల్‌కు అయితే.. ఇప్పటికే హీరోగా ఒక సినిమా చాన్స్‌ కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో న‌టిస్తాన‌ని మెగాస్టార్ చిరంజీవి, బ్ర‌హ్మానందం ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చారు. మరోవైపు బిగ్‌బాస్‌ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్‌కు కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలతో పాటు స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న ఓ షోలో జడ్జిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా నాల్గో సీజ‌న్‌లో పాల్గొన్న‌ ఒక్కొక్కరికి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లో క్రేజీ జంట‌గా పేరొందిన అరియానా-అవినాష్ జోడీకి కూడా ఇప్పుడు ఆఫర్లు వ‌స్తున్నట్లు తెలుస్తోంది.
(చదవండి : భలే చాన్స్‌ కొట్టేసిన మోనాల్‌.. బుల్లితెరపై సందడి)

బిగ్‌బాస్‌ హౌస్‌లో అరియానా, అవినాష్‌ జోడికి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదే. నెటిజన్లు అయితే ఈ జంటకు అవియానా అని పేరు పెట్టి మరి ప్రశంసలు కురిపించారు. ఇంట్లో ఉన్నన్ని రోజులు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, అన్నం తినిపించుకోవడం, ఒకరిపైఒకరు పంచ్‌లు వేసుకోవడం వీక్షకులను బాగా ఆకట్టుకుంది. అవినాష్‌ ఎలిమినేట్‌ అయినప్పుడు అరియానా ఎంత భావోద్వేగానికి గురైందో అంద‌రూ చూశారు. ఇలా ఈ సీజ‌న్‌లో గుడ్ పెయిర్‌గా గుర్తింపు పొందిన ఈ జంట‌తో ప్రత్యేక ప్రోగ్రామ్‌లను నిర్వహించి టీఆర్పీ రేటింగ్‌ను పెంచుకునే ప్లాన్‌ చేస్తున్నాయట కొని ఎంటర్‌టైన్‌మెంట్‌ చానళ్లు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్దరిని హోస్ట్‌గా పెట్టి స్పెషల్‌ ప్రోగ్రామ్‌లను ప్లాన్ చేస్తున్నారట ఓ చానల్‌ నిర్వాహకులు. కాగా హోస్ట్‌గా అరియానాకు మంచి అనుభవం ఉంది. అలాగే అవినాష్ కూడా శ్రీముఖితో క‌లిసి ఓ షోను హోస్ట్ చేశాడు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఈ ఇద్ద‌రితో క‌లిసి ప‌లు ఛానెళ్ల వాళ్లు షోలు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అరియానా, అవినాష్‌ టీవీ ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని చానళ్లకు జంటగా వెళ్లి మరి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ జంట హోస్ట్‌గా వస్తే.. బుల్లితెరపై సందడి మాత్రం మా..ములుగా ఉండదు మరి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top