Padma Shri Award To Bheemla Nayak Singer Darshanam Mogulaiah - Sakshi
Sakshi News home page

‘పద్మ శ్రీ’మొగులయ్య.. 12 మెట్ల కిన్నెర.. తెలంగాణలో ఒక్కరే!

Published Wed, Jan 26 2022 9:09 AM

Bheemla Nayak Singer Mogulaiah To Recive Padma Shri Award - Sakshi

‘ఆడా లేడు మియాసావ్‌.. 
ఈడా లేడు మియాసావ్‌.. 
పానిగంటి గుట్టలమీద పావురాల గుండున్నదీ..  
రాత్రి గాదు.. ఎలుగు గాదు.. వేగుచుక్క పొడువంగానే పుట్టిండాడు పులిబిడ్డ..’

అంటూ తన 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే.. అటుగా వెళ్తున్న వారి కాళ్లు అక్కడే ఆగిపోతాయి. మధురమైన సంగీతం, లయబద్ధమైన పాటకు కిన్నెరపై నాట్యమాడే చిలుకను చూస్తూ చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా మైమరచిపోవాల్సిందే. ఊయలలో పసిపాప నిదురపోయేటప్పుడు.. ఊడలమర్రి కింద ఊర్లో జనం సేద తీరేటప్పుడు.. వెన్నెల వాకిట్లో కురిసిన పల్లెగానం.. ఇప్పుడు నల్లమల నుంచి ఢిల్లీకి తాకింది. ప్రాచీన సంగీత వాయిద్యం ‘కిన్నెర’ కళాకారుడు దర్శనం మొగులయ్యను పద్మశ్రీ అవార్డు వరించింది. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది.  

జులపాల జుట్టు, పంచెకట్టు, కోరమీసం.. భుజం మీద 12 మెట్ల వాయిద్యంతో ఆకట్టుకునే ఆహార్యంలో ఉండే దర్శనం మొగులయ్యది నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. ఆయన పలికించే కిన్నెర సంగీతంతో పాటు ఆలపించే వీరగాథల్లో పౌరుషం ఉప్పొంగుతుంది. పురాతన కిన్నెర వాయిద్యం నుంచి వచ్చే సంగీతం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. జానపద గాథలైన పండుగ సాయన్న కథ, సీతమ్మ పర్ణశాల, దాదిమా ధర్మశాల, పానుగంటి మియాసాబ్, పిల్లా జాతర బోదం పిల్ల.. అంటూ పా టలు పాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. పానుగంటి మీరాసాబ్‌ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, పాలమూరు జానపద వీరుడు మియాసాబ్‌ గాథను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తాడు. పెద్దలను కొట్టి పేదలకు పంచే పండుగ సాయన్న వీరగాథ చిన్నా పెద్దా ఆసక్తిగా వింటారు. బలిసినోళ్లను దోచి పేదవారికి పంచి పెట్టి, పేదల పెళ్లిళ్లు చేసిన పండుగ సాయన్న కథను మొగులయ్య ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.  

ఆ పాటతో మరింత ఫేమస్‌
కిన్నెర కళ అంతరించిపోతుండటంతో మొగులయ్య దానికి మళ్లీ ప్రాణం పోయాలనుకున్నారు. ఈయన కళను గుర్తించి ఎంతోమంది ఆయనకు బాసటగా నిలిచారు. తెలుగు యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్‌ స్కాలర్‌ దాసరి రంగ  మొగులయ్యను ప్రోత్సహించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. కాలక్రమంలో ఎందరో ఆప్తులుగా మారి అండగా నిలిచారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మొగులయ్య  మరింత ఫేమస్ అయ్యారు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు.

కష్టాల్లోనూ కిన్నెరను వదలలేదు
మొగులయ్య పూర్వీకులు తాతలు, ముత్తాతల కాలం నుంచి కిన్నెర వాయిస్తూనే జీవనోపాధి పొందారు. తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ ఈ కళను నేర్చుకునేందుకు ఆసక్తి చూపలేదు. సుమారు 500 ఏళ్ల కిందటి నుంచి ఉపయోగిస్తున్న కిన్నెర మొదట ఏడు మెట్లు మాత్రమే ఉండేది. మొగులయ్య ప్రత్యేక శ్రద్ధతో తర్వాత 12 మెట్ల కిన్నెరగా తీర్చిదిద్ది.. ఆ వాయిద్యంతో మరిన్ని రాగాలను పలికిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొగులయ్యకు సెంటు భూమి లేదు. కిన్నెరనే ఆయన జీవనాధారం. అనారోగ్యంతో భార్య, కుమారులు, కుమార్తెలు ఒక్కొక్కరిగా మరణించారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఏనాడూ కిన్నెరను విడిచిపెట్టలేదు. పొట్టకూటి కోసం వరంగల్, మహారాష్ట్రలో మట్టిపని చేస్తూ కాలం ఎల్లదీశాడు. పన్నెండేళ్ల ప్రాయంలో కిన్నెర పట్టుకున్న మొగులయ్య వృద్ధాప్యం వచ్చినా.. తన కళను బతికించేందుకు తపిస్తూనే ఉన్నారు.  

శతాబ్దాల నాటి సంప్రదాయ పురాతన వాయిద్యం కిన్నెరను మొగులయ్య జీవనోపాధిగా చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కళను నేర్చుకునేవారు కరువయ్యారు. కిన్నెర తయారీ సైతం ఎవరూ చేయడం లేదు. అంతరించిపోతున్న దశలో ఉన్న అరుదైన కిన్నెరను 12 మెట్లుగా అభివృద్ధి చేసిన ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఈయన జీవిత చరిత్ర ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న కళాకారుడు మొగులయ్య ఒక్కరే.

Advertisement
Advertisement